FASTag: సంక్షోభంలో కూరుకుపోయిన పేటీఎంకి మరో షాక్ తగలింది. మార్చి 15 లోగా పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు ఇతర బ్యాంకులకు మారాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) సూచించింది. మార్చి 15, 2024లోపు వేరే బ్యాంకులు జారీ చేసిన కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ని కొనుగోలు చేయాలని సూచించింది. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు వాహనదారులు పెనాల్టీలు, రెట్టింపు రుసుము చెల్లించకుండా ఈ సూచనను పాటించాలని మార్చి 13న రోడ్డు & రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది.
డిజిటల్ లావాదేవీల్లో ఓ వెలుగు వెలిగిన పేటీఎం ఇప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఇటీవల ఆర్బీఐ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ముందుగా ఫిబ్రవరి 29 తర్వాత యూజర్ల నుంచి ఎలాంటి నిధులను తీసుకోవద్దని, డిపాజిట్లను స్వీకరించడం, క్రెడిట్ లావాదేవీలను నిర్వహించ వద్దని ఆదేశించగా.. ఈ వ్యవధిని మార్చి 15 వరకు పెంచింది.
రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు మార్చి 15 తర్వాత పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లు రీఛార్జ్ లేదా టాప్-అప్ చేయలేరు. పేటీఎం ఫాస్ట్ ట్యాగ్‌కి సంబంధించి ఏవైనా తదుపరి ప్రశ్నలు లేదా సహాయం కోసం వినియోగదారులు వారి సంబంధిత బ్యాంకులతో సంప్రదించవచ్చని లేదా ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) వెబ్‌సైట్‌లో అందించిన FAQలను చూడవచ్చని రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది. అంతరాయం లేని ప్రయాణం కోసం చురుకైన చర్యలు తీసుకోవాలని పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లను NHAI కోరింది.