బీహార్‌లో గతేడాది వర్షాకాలంలో అనేక బ్రిడ్జ్‌లు కూలిపోయాయి. దీంతో నితీష్ కుమార్ సర్కార్‌పై అనేక విమర్శలు వచ్చాయి. ఇక గత నెలలో మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వం గద్దెనెక్కింది. కొత్త సర్కార్ ఏర్పడిన నెలరోజులకే ప్రారంభానికి సిద్ధంగా ఉన్న రోప్ వే కూలిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
బీహార్‌లోని రోహ్తాస్ జిల్లాలో రోహితేశ్వర్ ధామ్ ఆలయానికి సులభంగా చేరేందుకు రోప్ వేను నిర్మించారు. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం శుక్రవారం ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. ఎవరికీ ఏం కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ రోప్ వే ప్రాజెక్ట్‌ను 2019లో నితీష్ కుమార్ ప్రారంభించారు. ఫిబ్రవరి 12, 2020న ప్రాజెక్ట్ పనులు ప్రారంభమయ్యాయి. రూ.13.65 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే పనులు పూర్తి కావడంతో జనవరి 1న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంతలో కోల్‌కతాకు చెందిన రోప్‌వే అండ్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ శుక్రవారం ట్రయల్స్ నిర్వహించింది. ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా సడన్‌గా కూలిపోయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని అధికారులు పేర్కొన్నారు. నాలుగు ట్రాలీలు దెబ్బతిన్నాయని.. కార్మికులు తమను తాము రక్షించుకోగలిగారని తెలిపారు. ఇక ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
