Site icon NTV Telugu

Electric Bike Blast: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తండ్రి, కూతురు మృతి

ఛార్జింగ్‌ పెట్టిన ఓ ఎలక్ట్రిక్‌ బైక్‌ బ్యాటరీ.. తండ్రి, కూతురు ప్రాణాలు తీసిన ఘటన తమిళనాడులోని వేలూరులో విషాదాన్ని నింపింది… పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వేలూరు జిల్లాలోని అల్లాపురం ప్రాంతానికి చెందిన దురై వర్మ (49) కేబుల్ టీవీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కుమార్తె మోహన ప్రీతి (13) పోలూరు ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ఇదిలా ఉండగా దురై వర్మ రెండు రోజుల క్రితం ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి తండ్రీకూతుళ్లు చార్జింగ్ పెట్టి నిద్రిస్తుండగా, ఓవర్ చార్జింగ్ కారణంగా వైరు తగిలి బైక్ పేలిపోయింది.. మరో బైక్‌కు మంటలు అంటుకున్నాయి. అయితే, పేలుడు ధాటికి భారీగా పొగలు కమ్ముకోవడంతో బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఇంట్లోనే ఇరుక్కుపోయిన తండ్రీకూతుళ్లు బాత్‌రూమ్‌లో దాక్కున్నారు.. అదే వారి ప్రాణాలను తీసింది..

Read Also: GVL: అన్ని రాష్ట్రాలకంటే ఏపీకే కేంద్రం నిధులు ఎక్కువ.. చర్చకు మేం రెడీ..

బాత్‌రూమ్‌లోకి కూడా దట్టమైన పొగలు రావడంతో.. ఊపిరాడక తండ్రీకూతుళ్లు అక్కడే మృతిచెందారు.. ఇక, దురైవర్మ ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన ఫైర్‌ సిబ్బంది.. మంటలార్పి లోపలికి వెళ్లిచూస్తే.. అప్పడికే తండ్రీకూతుళ్లు మృతి చెందారు. ఇక, బాత్‌రూమ్‌ నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు నిర్ధారించారు. మరోవైపు.. కొత్తగా కొనుగోలు చేసిన బ్యాటరీ బైక్ పేలడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Exit mobile version