Bihar Elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తం ఆసక్తి నెలకొంది. రేపు (నవంబర్ 14)న కౌంటిక్ జరగబోతోంది. బీహార్‌లో అధికారంలోకి వచ్చేది ఎన్డీయేనా?, మహాఘట్బంధన్ కూటమా? అనేది రేపటితో తేలబోతోంది. అయితే, కౌంటింగ్ వేళ ఆర్జేడీ నేత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బీహార్ ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తే నేపాల్, బంగ్లాదేశ్ తరహా నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయని ఆర్జేడీ నేత సునీల్ సింగ్ ఎన్నికల అధికారుల్ని హెచ్చరించారు.
ఓట్ల లెక్కింపులో పాల్గొనే అధికారులు ప్రజా తీర్పును దెబ్బ తీయవద్దని, అలా చేస్తే బీహార్‌లో అశాంతి నెలకొంటుందని హెచ్చరించారు. తమ పార్టీ అప్రమత్తంగా ఉందని, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించవద్దని సింగ్ కోరారు. 2020లో మా ఆర్జేడీ అభ్యర్థుల్లో చాలా మంది బలవంతంగా ఓడిపోయారని, ప్రజలు ఓట్లేసి గెలిపించాలనుకున్న వ్యక్తిని ఓడిస్తే నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలకం తరహాలో రోడ్లపై పెద్ద ఎత్తున నిరసనలు కనిపిస్తాయని కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే అధికారుల్ని హెచ్చిరించారు.
Read Also: H-1B Visa: అమెరికాకు రండి, మా వాళ్లకు శిక్షణ ఇవ్వండి, తిరిగి సొంత దేశానికి వెళ్లండి..
ఆర్జేడీ 140 నుంచి 160 స్థానాలు గెలుచుకుంటుందని, తేజస్వీ యాదవ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని సునీల్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. లెక్కింపు ప్రక్రియలో ఏమైనా అవకతవకలు ఏర్పడితే, వాటిని ఎదుర్కొనేందుకు ఆర్జేడీ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చేస్తే, సామాన్య ప్రజలు వీధుల్లోకి వస్తారని అన్నారు. ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఆర్జేడీ నేతపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
243 స్థానాలు ఉన్న బీహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు జరిగాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీజేపీ+జేడీయూ పార్టీల ఎన్డీయే కూటమి మరోసారి గెలుస్తుందని అంచనా వేశాయి. దాదాపు 10కి పైగా ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చెప్పాయి. అయితే, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఈ ఎగ్జిట్ పోల్స్‌ను తోసిపుచ్చారు. తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని అన్నారు.
