Nepal Floods: నేపాల్ జలప్రళయానికి ముందు భూకంపం.. 7 నిమిషాల్లోనే ఫ్లాష్ ఫ్లడ్స్!

  • జలప్రళయానికి సుమారు 7 నిమిషాల ముందు 4.4 తీవ్రతతో భూకంపం.
  • టిబెట్ హిమాలయాల్లో సుప్రాగ్లేషియల్ సరస్సు బద్ధలై ఉండొచ్చన్న అంచనా.
  • లెహెండే ఖోలా నదిలో ఒక్కసారిగా భారీగా నీటి ప్రవాహం.
  • భోటేకోశి నదిలోకి వరద నీరు చేరడంతో ఫ్లాష్ ఫ్లడ్స్.
Nepal Floods (3)

Nepal Floods (3)

Nepal Floods: నేపాల్ జల ప్రళయానికి ముందు భూకంపం సంభవించినట్లు తెలుస్తోంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం, ఈ ఘటనకు సుమారు ఏడు నిమిషాల ముందు 4.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఫ్లాష్ ఫ్లడ్స్‌కు 7 నిమిషాల ముందు భూకంప వచ్చినట్లు తెలుస్తోంది. భూప్రకంపనలతో చైనాలోని టిబెట్ ప్రాంతంలోని హిమాలయాల్లో ఉన్న సుప్రాగ్లేషియల్ సరస్సు బద్ధలవ్వడంతోనే ఒక్కసారిగా లెహెండే ఖోలా నదిలో ఒక్కసారిగా నీటి ఉధృతి పెరిగినట్లు తెలుస్తోంది. ఈ నదికి దిగువనే ఉన్న భోటేకోశి నదిలోకి నీరు పోటెత్తడంతో వరద విరుచుకుపడింది.

టిబెట్ సరిహద్దుల్లో ఉన్న రాసువా జిల్లాను మెరుపు వరదలు ముంచెత్తాయి. మానస సరోవర్ యాత్ర, గోసైంకుండ యాత్రలకు కీలకంగా రాసువా జిల్లా ఉంది. రాసువా జిల్లా మీదుగానే ఈ యాత్రలకు విదేశీయులు వెళ్తుంటారు. మెరుపు వరదలు వచ్చే ముందు టిమురే, స్యాప్రుబేసి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో విదేశీ టూరిస్టులు ఉన్నారు. మానస సరోవర్ యాత్రకు వెళ్తున్న 400 మందికి పైగా యాత్రికులు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఇందుల్లో 133 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది. వరద ధాటికి భోటేకోశి నది పరివాహక ప్రాంతాలు, నది ఒడ్డున ఉన్న గ్రామాలు తుడిచిపెట్టుకుపోయాయి.

తిమురే బజార్, సరిహద్దు కస్టమ్స్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వాహనాలు, సరకుల రవాణా వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. గతేడాది వరదల తర్వాత పునర్నిర్మించిన రసువాగఢి ఫ్రెండ్‌షిప్ బ్రిడ్జ్ కూడా ఈ వరదల్లో తుడిచిపెట్టుకుపోయింది. మూడు నేపాల్ పోలీస్ కార్యాలయాలు దెబ్బతిన్నాయి. టిబెట్ సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న తొమ్మిది మంది ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది గల్లంతయ్యారు. వరదల కారణంగా 11 జల విద్యుత్ కేంద్రాలు నాశనమయ్యాయి. సుమారు 430 మెగావాట్ల విద్యుత్ సరఫరా ప్రభావితమైంది.