NTV Telugu Site icon

Table-Top Runways: నేపాల్ విమాన ప్రమాదానికి ‘‘టేబుల్‌-టాప్ రన్ వే’’ కారణమా?.. భారత్‌లో 5 ఎయిర్‌పోర్టులు.. గతంలో ప్రమాదాలు..

Table Top Runways

Table Top Runways

Table-Top Runways: నేపాల్‌లో ఈ రోజు ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలోని 18 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రగాయాలైన పైలెట్‌ని ఆస్పత్రికి తరలించారు. ప్రపంచవ్యాప్తంగా సంక్లిష్ట రన్ వేలు కలిగిన విమానాశ్రయాలు నేపాల్‌లో ఉన్నాయి. ఈ రన్ వేల కారణంగా ఇప్పటికే పలుమార్లు నేపాల్‌లో భారీ విమాన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. విమాన ప్రమాదాలకు ‘టేబుల్ టాప్ రన్ వేస్’’ కారణమవుతున్నాయి. సాధారణంగా చుట్టుపక్కల ప్రాంతాల కన్నా ఎక్కువ ఎత్తులో ఉండే రన్ వేలను ఈ పేరుతో వ్యవహరిస్తుంటారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, పర్వతాల ప్రాంతాల్లో ఉండే విమానాశ్రయాలు టేబుల్ టాప్ రన్ వేలను కలిగి ఉంటాయి. ఈ రన్ వేలు చిన్నగా ఉండటంతో పైలెట్లకు టేకాఫ్, ల్యాండిగ్ అనేది ఇబ్బందితో కూడుకున్న విషయం. ఒకవేళ ఎక్కువ రన్ వేని ఉపయోగించుకునే పక్షంలో విమానం క్రాష్ అవుతుంది.

అయితే, ఇలాంటి రన్ వేలు భారతదేశంలో కూడా 5 ఉన్నాయి. 2010లో ఎయిరిండియా విమానం మంగళూర్‌ ఎయిర్ పోర్టులో క్రాష్ కావడంతో 158 మంది ప్రాణాలు కోల్పోయారు. టేబుల్ టాప్ రన్ వే కలిగిన ఎయిర్ పోర్టుల్లో మంగళూర్ కూడా ఒకటి. మంగళూర్‌తో పాటు దేశంలో సిమ్లా, కాలికట్, లెంగ్‌పుయ్(మిజోరాం), పాక్యోంగ్(సిక్కిం) టేబుల్ టాప్ రన్ వేస్‌ని కలిగి ఉన్నాయి.

Read Also: Dhruv Rathee: యూట్యూబర్ ధృవ్ రాఠీపై బీజేపీ నేత కేసు.. సమన్లు జారీ..

మంగళూర్ ఘటన జరిగిన పదేళ్ల తర్వాత ఆగస్టు 07, 2020లో మరో టేబుల్ టాప్ రన్ వే‌పై విషాదం నెలకొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకువస్తున్న క్రమంలో కోజికోడ్‌లో ఎయిర్ ఇండియా విమానం టేబుల్ టాప్ రన్ వే నుంచి జారి కిందకు పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు మరణించారు. 169 మంది ప్రాణాలతో బయటపడ్డారు. 1977లో పోర్చుగల్‌లోని మదీరా విమానాశ్రయంలో టేబుల్ టాప్ రన్ వే కలిగిన ఎయిర్‌పోర్టులో కూలిపోయి 131 మంది మరణించారు.

ఈ రోజు ఉదయం నేపాల్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో బోంబార్డియన్ సీఆర్జే 200 విమానం రన్ వే నుంచి జారిపోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించారు. ఖాట్మాండులోని త్రిభువన్ ఎయిర్‌పోర్టు ఒక పీఠభూమిపై ఉంది. దీని చుట్టూ లోతైన కనుమలు, లోయలు ఉ న్నాయి. ఖాట్మాండు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్‌పోర్టుల్లో ఒకటి. 1992లో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం ఖాట్మాండులో ల్యాండింగ్‌కి ముందు భారీ క్రాష్ జరిగింది. 167 మంది మరణించారు.

Show comments