Neha Bora: కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసన పిలుపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA) అధ్యక్షురాలు నేహా బోరా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. అక్టోబర్ 16న తనను అదుపులోకి తీసుకున్న తర్వాత రూ. 10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించి శాంతిభద్రతలను కాపాడాలని ఆదేశిస్తూ జారీ చేసిన నోటీసులు ఆమె ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. నేహాబోరా తరుఫున న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపించారు. నేహాబోరా ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యల్లో పాల్గొనలేదని ఆయన కోర్టుకు తెలిపారు. హింసను ప్రేరేపించేలా ఆమె ఎలాంటి పిలుపుఇవ్వలేదని వాదించారు.
అక్టోబర్ 16న తిరంగా యాత్ర సమయంలో మండీ హౌజ్ వద్ద నేహా బోరాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరుసటి రోజు విడుదలైన ఆమెకు అక్టోబర్ 18న ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ (SEM) నుంచి నోటీసు అందింది. రూ.10 వేల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని, శాంతిభద్రతలను కాపాడాలని అందులో ఆదేశించారు. జంతర్ మంతర్‌ను అధికారికి నిరసన స్థలం నుంచి తొలగించినప్పటికీ, ఆంక్షలు ఉన్నప్పటికీ ప్రజల్ని కన్నాట్‌ప్లేస్ వైపు వెళ్లేలా నేహా బోరా ప్రేరేపించారని నోటీసుల్లో ఆరోపించారు.
అయితే, నేహా బోరాను మండీ హౌజ్ చేరుకున్న 10-15 నిమిషాల్లోపే అదుపులోకి తీసుకున్నారని ఆమె న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆ రోజు శాంతిభద్రతలకు భంగం కలిగిచేలా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని వాదించారు. మండీ హౌజ్‌లో కలుద్దామని నేహా బోరా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులో, ఎలాంటి హింసకు పిలుపునివ్వలేదని, ప్రజాశాంతికి విఘాతం కలిగించే ఉద్దేశం కనిపించడం లేదని న్యాయవాది పేర్కొన్నారు. జంతర్ మంతర్ వద్ద ఆంక్షలు ఉన్నాయని, మండీ హౌజ్ ప్రాంతాలు ఆ పరిధిలోకి రావని న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేయాలని నేహా బోరా తరుపున కోర్టును కోరారు.

