Site icon NTV Telugu

Presidential Poll: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

Draupadi Murmu Nomination

Draupadi Murmu Nomination

ఎన్డీఏ కూటమి తరఫున ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు సహా మద్దతు పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు నామినేషన్‌ పత్రాలను ఆమె అందజేశారు. ద్రౌపది ముర్ము నామినేషన్‌ను ప్రధాని మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మద్దతు పార్టీల నేతల సంతకాలతో నాలుగు సెట్ల నామపత్రాలను ఆమె దాఖలు చేశారు. మినేషన్‌ దాఖలు చేసే కంటే ముందు ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఇదిలా ఉంటే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి తెలుగు రాష్ట్రాల నుంచి వైపీసీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. నామినేషన్‌ కార్యక్రమానికి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, లోక్‌సభాపక్ష నేత మిథున్‌ రెడ్డి హాజరయ్యారు.

నామినేషన్ దాఖలుకు ఒకరోజు ముందుగా గురువారమే ఢిల్లీకి చేరుకున్న ద్రౌపది ముర్ము.. ఒడిశా భవన్‌లో బస చేశారు. భువనేశ్వర్‌ విమానాశ్రయంలో పలు పార్టీల నాయకులు, అభిమానులు ఆమెకు వీడ్కోలు పలికారు. గిరిజన నృత్యాలతో, సంప్రదాయ దుస్తులతో వచ్చిన అభిమానులతో అక్కడంతా కోలాహలం కనిపించింది. ఢిల్లీకి చేరుకున్న అనంతరం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్‌ షాతో ద్రౌపది ముర్ము భేటీ అయ్యారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధానమంత్రి నివాసానికి ఆమె వెళ్లి, తనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ఒడిశాలోని బైడపోసి గ్రామంలో 1958 జూన్ 20న సంతాల్ అనే సంప్రదాయ గిరిజన కుటుంబంలో ద్రౌపది ముర్ము జన్మించారు. టీచర్‌గా పనిచేస్తూ భారతీయ జనతా పార్టీ పట్ల ఆకర్షితురాలై ఆమె బీజేపీలో చేరారు. కార్యకర్త నుంచి జాతీయ కమిటీలో చోటు పొందే స్థాయికి ఎదిగారు. ఒడిశాలో 2000-2002 మధ్య సంకీర్ణ ప్రభుత్వంలో బీజేపీ నుంచి ద్రౌపది ముర్ము మంత్రిగా పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త, ఇద్దరు కొడుకులు గతంలో చనిపోయారు. ప్రస్తుతం ఓ కుమార్తె ఉంది. కాగా జూలై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా అదే నెల 21న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా.. ఈనెల 29తో గడువు ముగియనుంది. మరోవైపు ఈనెల 27న నామినేషన్ దాఖలు చేయనున్నట్లు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలిపారు.

Exit mobile version