Site icon NTV Telugu

Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నిక..

On Birla

On Birla

Om Birla: లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఎన్నికయ్యారు. 50 ఏళ్ల తరువాత తొలిసారిగా లోక్‌సభ స్పీకర్‌ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడ్డాయి. ఎన్డీయే తన అభ్యర్థిగా ఓం బిర్లాను ప్రతిపాదించగా, కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్‌ని ఇండియా కూటమి ప్రతిపాదించింది. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Read Also: Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సీబీఐ..

మూడుసార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా, గత పార్లమెంట్‌లో కూడా లోక్‌సభ స్పీకర్‌గా పనిచేశారు. వరసగా రెండోసారి స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ రోజు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆయన స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఎన్నికైన ఓంబిర్లాకు ప్రధాని నరేంద్రమోడీ కరచాలనం చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఓంబిర్లాను అభినందించారు. ప్రధాని, ప్రతిపక్ష నేత, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అతడిని స్పీకర్ కుర్చీపై కూర్చోపెట్టారు.

స్వాతంత్రం అనంతరం ఇది మూడోసారి స్పీకర్ ఎన్నిక. చాలా సందర్భాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకగ్రీవంగా స్పీకర్‌ని ఎన్నుకునే సంప్రదాయం ఉంది. అయితే, ఈ సారి మాత్రం డిప్యూటీ స్పీకర్ పోస్టు తమకు ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఇండియా కూటమి పోటీలో నిలబడింది. ఎన్డీయే కూటమికి స్వతహాగా 293 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎంపీలు కూడా ఓంబిర్లాకు మద్దతు తెలిపారు. ఇండియా కూటమికి 232 మంది ఎంపీల ఉన్నారు. స్పీకర్ ఎన్నికకు 271 ఓట్లు అవసరం కాగా, ఓం బిర్లా సునాయాసంగా విజయం సాధించారు.

Exit mobile version