Site icon NTV Telugu

Garba Dance : చీరలు ధరించి గర్బా చేసిన పురుషులు.. అసలు విషయం ఇదే..!

Mens Garba Dance

Mens Garba Dance

Garba Dance : నవరాత్రి పండుగ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తి, ఉత్సాహం ఉట్టిపడుతున్న వేళ గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఒక ప్రత్యేకమైన ఆచారంతో దేశ దృష్టిని ఆకర్షించింది. గర్బా, డాండియా నృత్యాలతో గుజరాత్ పేరు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందగా, అహ్మదాబాద్‌లోని సాదు మాతా ని పోల్ ప్రాంతానికి చెందిన పురుషులు మాత్రం ప్రతి ఏడాది భిన్నమైన ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నవరాత్రి ఎనిమిదవ రోజు వారు మహిళల దుస్తులు అయిన చీరలు ధరించి గర్బా నృత్యం చేస్తారు. ఇది సాధారణ ఉత్సవం కాదని, దీని వెనుక రెండు శతాబ్దాల నాటి ఒక గాథ, ఒక శాపం ఉందని స్థానికులు చెబుతున్నారు.

సుమారు 200 సంవత్సరాల క్రితం సాదుబెన్ అనే మహిళ తన బిడ్డతో కలిసి అక్కడ నివసించేది. ఒక రోజు మొఘల్ కులీనుడు ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించగా, ఆమె బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషుల సహాయం కోరింది. కానీ వారు ఆమెను రక్షించలేకపోయారు. ఆ సంఘటనలో సాదుబెన్ తన బిడ్డను కోల్పోయి తీవ్ర వేదనలో మునిగిపోయింది. ఆగ్రహంతో, ఆవేదనతో ఆ పురుషులను శపించి, “మీ తరాలు పిరికివాళ్ళుగా మిగిలిపోతారు” అని శపించింది. అప్పటి నుంచి ఆ శాపాన్ని నివారించుకోవడానికి, అలాగే సాదుబెన్ జ్ఞాపకార్థం బారోట్ కమ్యూనిటీ పురుషులు మహిళల వేషధారణలో గర్బా నృత్యాన్ని ప్రతి ఏడాది నిర్వహిస్తున్నారు. ఈ ఆచారాన్ని “సదుమా నా గర్బా” అని పిలుస్తారు.

UP: వరకట్నం హత్య కేసులో షాకింగ్ ఘటన.. రెండేళ్ల తర్వాత బిగ్ ట్విస్ట్

ఈ ఏడాది కూడా ఆ సంప్రదాయం కొనసాగగా, ఆ దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @awesome.amdavad అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అప్‌లోడ్ చేసిన రీల్ ఇప్పటివరకే 3 మిలియన్ల మందికి పైగా వీక్షించగా, 83 వేలకుపైగా లైక్‌లు అందుకుంది. నెటిజన్లు ఈ వీడియోపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు “సంప్రదాయాన్ని కాపాడిన వారే ధన్యులు” అని ప్రశంసించగా, మరికొందరు “ఓ స్త్రీ రేపురా” సినిమా సన్నివేశాన్ని గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. ఇంకొందరు “దేవత రూపంలో భక్తి స్పష్టంగా కనిపిస్తోంది” అని అభిప్రాయపడ్డారు.

నేటి కాలంలో పాత ఆచారాలు, విశ్వాసాలు మసకబారుతున్నా, అహ్మదాబాద్‌లోని ఈ ఆచారం మాత్రం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. స్త్రీ శక్తికి గౌరవం తెలుపుతూ, పూర్వకాల గాథను జ్ఞాపకం చేసుకుంటూ జరుగుతున్న ఈ “చీర గర్బా” సంప్రదాయం నవరాత్రి పండుగకు ప్రత్యేకతను చేకూరుస్తోంది.

BJP: విదేశాల్లో భారత్‌ను కించపరుస్తున్న రాహుల్ గాంధీ.. బీజేపీ నేతల ఆగ్రహం..

Exit mobile version