Site icon NTV Telugu

Nagpur Metro: గిన్నిస్ రికార్డులకెక్కిన నాగ్‌పూర్ మెట్రో.. ప్రపంచంలో ఎక్కడా లేదు

Nagpur Metro Record

Nagpur Metro Record

Nagpur Metro enters Guinness Book of World Record for longest double-decker viaduct metro: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రెండంతస్తుల ఫ్లైఓవర్‌ గల మెట్రోగా గిన్నిస్‌ రికార్డులకెక్కింది. వార్ధా రోడ్డుపై ఈ మెట్రో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని పొడవు అక్షరాల 3.14 కిలోమీటర్లు. ఈ మార్గంలో మూడు మెట్రో స్టేషన్లు కూడా ఉన్నాయి. పైన మెట్రో వెళ్తుండగా.. మధ్యలో హైవే, కింద సాధారణ రవాణా మార్గం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మెట్రో నిర్మాణాల్లో.. ఇంత పొడవైన డబుల్ డెక్కర్ వయాడక్ట్ మెట్రో ఎక్కడా లేదు. ఇది ఇప్పటికే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా.. ఆసియాలోనే అత్యంత పొడవైన నిర్మాణంగా గుర్తించబడింది.

ఇప్పుడు తాజాగా గిన్నిస్ రికార్డులకెక్కడంతో.. మహారాష్ట్ర మెట్రో విభాగానికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ శుభాకాంక్షలు తెలిపారు. అటు.. నాగ్‌పూర్‌లోని మెట్రో భవన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో మహారాష్ట్ర మెట్రో ఎండీ బ్రిజేశ్ దీక్షిత్ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మెట్రో మార్గం నిర్మించడం అంత ఆషామాషీ కాదని, తమ టీమ్‌కి ఇది పెద్ద సవాల్‌గా మారిందన్నారు. కాగా.. ఈ డబుల్ డెక్కర్ వయాడక్ట్‌ని మహారాష్ట్ర మెట్రో, ఎన్‌హెచ్ఏఐ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఈ వయాడక్ట్ నిర్మాణం.. మూడు లేయర్ల రవాణా కారిడార్ నిర్మాణంలో సహాయపడింది. మొదటి లేయర్‌లో ముందుగా ఉన్న హైవే ఉండగా, రెండో లేయర్‌లో ఫ్లైఓవర్ హైవే, మూడో లేయర్‌లో నాగ్‌పూర్ మెట్రో రైలు ఉన్నాయి. ఆల్రెడీ ఫ్లైఓవర్ హైవే 9 మీటర్ల ఎత్తులో నిర్మించగా.. 20 మీటర్ల ఎత్తులో ఈ మెట్రో మార్గాన్ని నిర్మించారు.

ఇదిలావుండగా.. పూణే మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (PMRDA) కూడా గణేష్‌ఖిండ్ రహదారిపై మరో ఇంటిగ్రేటెడ్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌పై పని ప్రారంభించింది. దీని గురించి పీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ రాహుల్ మహివాల్ మాట్లాడుతూ.. గణేష్‌ఖిండ్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకే ఈ మెట్రో మార్గాన్ని నిర్మించబోతున్నట్టు తెలిపారు. డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌ను పిఎంఆర్‌డిఎ నిర్మిస్తుందని.. టాప్‌లో మైట్రో రైలు ఉంటుందని అన్నారు. ఇది గణేష్‌ఖిండ్ రహదారితో ఫ్లైఓవర్ ద్వారా మూడు రోడ్లను కలుపుతుందన్నారు.

Exit mobile version