NTV Telugu Site icon

Nagaland: నాగాలాండ్ రాష్ట్రంలో వందేళ్ల తరువాత రెండో రైల్వే స్టేషన్

Nagaland

Nagaland

Nagaland Gets Its 2nd Railway Station After A Gap Of Over 100 Years: ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే కనెక్టివిటీ అంతంత మాత్రంగానే ఉంటుంది. మొత్తం కొండలు, గుట్టలు, వాగులు, నదులతో ఉండే భౌగోళిక స్వరూపం రైల్వే నిర్మాణానికి ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో ఈశాన్య రాష్ట్రాలు రైల్ అనుసంధానంలో వెనకబడి ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈశాన్య రాష్ట్రాలను ఇతర ప్రాంతాలతో అనుసంధానించేందుకు రైల్వే ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. దీంట్లో భాగంగానే నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని చేపడుతోంది.

ఇదిలా ఉంటే దాదాపుగా 100 ఏళ్ల తరువాత నాగాలాండ్ రాష్ట్రంలో రెండో రైల్వే స్టేషన్ ప్రారంభించారు. శోఖువి రైల్వే స్టేషన్ ను నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియో రియో శుక్రవారం ప్రారంభించారు. శోఖువి నుంచి డోనీ పోలో ఎక్స్‌ప్రెస్ రైల్ ను జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు నాగాాలాండ్ రాష్ట్రంలో కేవలం ఒకే రైల్వే స్టేషన్ ఉంది. నాగాలాండ్ వాణిజ్య రాజధాని దిమాపూర్ లో 1903లో రైల్వే స్టేషన్ నిర్మించారు. దాదాపుగా వందేళ్ల తరువాత శోఖువి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చింది. డోనీ పోలో ఎక్స్‌ప్రెస్ అస్సాం గౌహతి నుంచి అరుణాచల్ ప్రదేశ్ నహర్లాగన్ మధ్య నడుస్తుంది. అయితే ఈ రైలును ప్రస్తుతం శోఖువి వరకు పొడగించారు. దీంతో నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు రైలు మార్గం ద్వారా అనుసంధానించబడినట్లు అయింది.

Read Also: Special Story on Jio Super Success Journey: దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థగా ఎదిగిన క్రమంలో జియో సాగించిన సూపర్‌ సక్సెస్ జర్నీపై స్పెషల్‌ స్టోరీ

‘‘ ఈరోజు నాగాలాండ్‌కు చారిత్రాత్మకమైన రోజు. ధనసరి-శోఖువి రైల్వే మార్గం 100 ఏళ్ల తరువాత రెండో స్టేషన్ గా రైల్ సేవలను పొందింది’’ అంటూ నాగాలాండ్ ముఖ్యమంత్రి నిఫియో రియో ట్వీట్ చేశారు. ఈ రైల్వే స్టేషన్ వల్ల నాగాలాండ్ ప్రజలకు మాత్రమే కాకుండా.. మణిపూర్, అస్సాంలోని పొరుగు జిల్లాల ప్రజలు కూడా లాభం పొందనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అన్ని రాష్ట్రాల రాజధానులను అనుసంధానం చేసేందుకు భారతీయ రైల్వేలు, ఈశాన్య ఫ్రాంటియర్ రైల్వే కృషి చేస్తోందని జనరల్ మేనేజర్ అన్షుల్ గుప్తా అన్నారు. అస్సాంలోని ధన్ సిరి నుంచి నాగాలండ్ కోహిమా జిల్లాలోని జుబ్జా వరకు 90 కిలోమీటర్ల బ్రాడ్ గేజ్ మార్గానికి 2016లో శంకుస్థాపన చేశారు.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. దీని నిర్మాణ గడువును 2020 నుంచి 2024 వరకు పొడగించారు.