Site icon NTV Telugu

ప్రశ్నార్థకంగా మారిన నాగా శాంతి ప్రక్రియ!

శనివారం నాగాలాండ్‌లోని మాన్ జిల్లాలో జరిగిన ఆర్మీ ఆపరేషన్ లో పద్నాలుగు మంది పౌరులు చనిపోయారు. తీవ్రవాదులు జాడ గురించి సమాచారం అందటంతో ప్రత్యేక బలగాలు ఈ చర్యకు దిగాయి. కాని, వారు దాడి చేసింది ఉగ్రవాదులపై కాదు..సామాన్య పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై. ఐతే, ఇది పొరపాటున జరిగిందా, నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనేది దర్యాప్తులో తేలాల్సి వుంది.

మరోవైపు, ఈ సంఘటనను నిరసిస్తూ స్థానికంగా ఆందోళనలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాబోవు రోజులలో ఎలా ఉంటుందో తెలియదు. ఇది ఇలావుంటే, ఆపరేషన్‌ జరపటానికి ముందు సాయుధ బలగాలు ప్రోటోకాల్‌ పాటించలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఏకపక్షంగా కాల్పులకు దిగినట్టు తెలుస్తోంది.

సాయుధ బలగాలు ఇష్టానుసారంగా వ్యవహరించటానికి కారణం వారికి గల ప్రత్యేక అధికారాలే. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 ప్రకారం కల్లోలిత ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడే క్రమంలో సాయుధ బలగాలు ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు. ఆజ్ఞలు ఉల్లంఘించిన వారిపై బలప్రయోగం మాత్రమే కాదు అవసరమైతే కాల్పులూ జరపవచ్చు. అనుమానితులను వారెంటు లేకుండా అరెస్టు చేయటం వంటి ఇంకా అనేక అధికారాలు సంక్రమిస్తాయి. ఐతే అవి దుర్వినియోగమై మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నందున ఈ చట్టాన్ని తొలగించాలన్న డిమాండ్‌ చాలా కాలాంగా ఉంది. తాజా సంఘటనల నేపథ్యంలో ఈ డిమాండ్‌ మరోమారు చర్చకు వచ్చింది.

మరోవైపు, కొలిక్కివస్తున్న నాగా శాంతి ప్రక్రియపై కూడా ఈ సంఘటన ప్రభావం చూపవచ్చు. డిసెంబర్‌ 4 నాగాలకు బ్లాక్ డే అని కీలక వేర్పాటు గ్రూపు నేషనల్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాలాండ్‌- ఎన్‌.ఎస్‌.సి.ఎన్‌(ఐఎమ్‌) పేర్కొంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కొనసాగించటమే దీనికి కారణమని మరో వేర్పాటువాద సంస్థ నాగా నేషనల్ పొలిటికల్ గ్రూప్ (ఎన్‌ఎన్‌పీజీ) ఆరోపించింది.

నాగా తిరుగుబాటుదారులు, భారత ప్రభుత్వం మధ్య చాలా కాలంగా సాగుతున్న శాంతి చర్చలు దాదాపు ముగింపుకు వచ్చాయి. చర్చల తుది ఫలితాలపై ప్రభుత్వం ప్రకటన చేయాల్సి వుంది. ఐతే, ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా డిమాండ్‌తోనే సమస్య ఉంది. దీనికి కేంద్రం అంగీకరించే వరకు ఎలాంటి ఒప్పందం ఉండదని ఎన్‌.ఎస్‌.సి.ఎన్‌(ఐఎమ్‌) స్ఫష్టం చేసింది. దాంతో చర్చలలో ప్రతిష్టంభన ఏర్పడింది.

తాజా సంఘటనలతో భారత్‌ పట్ల నాగా ప్రజల వ్యతిరేకత పెరిగే ప్రమాదం ఉంది. 1950, 60ల నాటి సైనిక దురాగతాలను నాగా ప్రజలకు గుర్తుచేస్తోంది.కనుక, శాంతి ప్రక్రియపై ఏమేర ప్రభావం చూపుతుందో చెప్పటం కష్టం. అంతేకాదు, తిరుగుబాటు గ్రూపులు బలపడేందుకు దీనిని వాడుకునే ఛాన్స్‌ ఉంది. అవి తమ డిమాండ్లను మరింత బలంగా ప్రభుత్వం ముందుకు తేవచ్చు. ఒప్పందంపై సంతకం చేసేందుకు సిద్ధంగా ఉన్న వారు కూడా ప్రజాగ్రహం దృష్ట్యా వెనక్కి తగ్గొచ్చు. ఏడు తిరుగుబాటు సంస్థలతో కూడిన ఎన్‌ఎన్‌పిజి శాంతి చర్చల ప్రక్రియను సమర్ధించింది. ప్రత్యేక జెండా డిమాండ్‌ను కూడా వదులుకుంది. కానీ తాజా పరిణామంతో అది మనసు మార్చుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేము.

1997లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి నుంచి భారత ప్రభుత్వం , ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐ-ఎమ్‌) మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్నేళ్లలో పరస్పరం ఒక అవగాహనకు వచ్చాయి. నాగా ప్రజల ప్రత్యేక చరిత్ర, దాని ప్రత్యేక స్థానాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది. ఇదే సమయంలో భారతీయ వ్యవస్థలోని ఇబ్బందులను ఎన్‌ఎస్‌సీఎన్‌ (ఐ-ఎమ్‌) అర్థం చేసుకోగలిగింది. ఈ క్రమంలో 2015 ఆగస్టులో ఇరు పక్షాల మధ్య ఒక ఒప్పందం కుదరింది. దాని ప్రకారం రెండు ప్రాంతాలు ప్రత్యేక అస్థిత్వంతో శాశ్వతంగా శాంతియుత సహజీవనం సాగిస్తాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో శాంతి ప్రక్రియ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. తిరిగి గాడిలో పడాలంటే ప్రభుత్వమే చొరవ చూపాలి.అందుకు తగిన వాతావరణం సృష్టించాలి. ముందుగా కాల్పుల ఘటనపై ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. త్వరిత గతిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అన్నిటికన్నా ముందు ప్రజాగ్రహాన్ని తగ్గంచవలసి ఉంటుంది. ఏది ఏమైనా, ప్రభుత్వం పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేక భావనను తొలగించిన తర్వాత మాత్రమే కేంద్రం చర్చలను తిరిగి ప్రారంభించగలదు. ఐతే, మునపటిలా అస్పష్టంగా కాకుండా ఈ సారి ప్రభుత్వం నాగా ప్రజలకు ఏమి ఇవ్వలేదో ..ఏమి ఇవ్వగలదో స్పష్టంగా చెప్పాలి!!

Exit mobile version