NTV Telugu Site icon

Pahalgam Terror Attack: నా పేరు భరత్.. నేను హిందువుని అనగానే తూటాల వర్షం.. బెంగళూరు టెక్కీ విషాదగాధ

Pahalgamterrorattack2

Pahalgamterrorattack2

పహల్గామ్  మారణహోమం.. ఎన్నో కుటుంబాల్లో చీకటి మిగిల్చింది. ఒక్కో కుటుంబానికి సంబంధించిన ఒక్కో విషాదగాధ వెలుగులోకి వస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు.. కుటుంబాలకు ఆధారమైన ఎందరో భాగస్వాములను కోల్పోవడంతో బాధితులంతా పుట్టెడు దు:ఖంలో మునిగిపోయారు.

బెంగళూరుకు చెందిన టెక్కీ భరత్ భూషణ్ (35) భార్య సుజాత, కుమారుడితో కలిసి పహల్గామ్‌కు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం కుమారుడిని ఎత్తుకుని భరత్ ఫొటో దిగుతున్నారు. భార్య సమీపంలో ఉండి ఫొటో తీస్తోంది. ఇంతలోనే ఉగ్రవాదులు వచ్చారు. కౌగిల్లో ఉన్న బిడ్డను ఇవ్వమని అడిగారు. అనంతరం పేరు.. మతం అడిగారు. తన పేరు భరత్.. తాను హిందువునని అని చెప్పాడు. ముస్లిం కాదని తెలియగానే తుపాకీ తలపై గురిపెట్టి.. భార్య, కుమారుడి ముందే భరత్‌ను కాల్చేశారు. భరత్ భూషణ్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. భార్య సుజాత.. బెంగళూరు రామయ్య ఆస్పత్రిలో పిల్లల వైద్యురాలిగా పని చేస్తోంది. భర్త కళ్ల ముందే చనిపోవడంతో మూడేళ్ల కుమారుడితో ఆమె గజగజ వణికిపోయింది.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: ప్రొఫెసర్ ప్రాణాలు కాపాడిన ‘కల్మా’ శ్లోకం

భరత్‌ కుటుంబం బెంగళూరులోని మత్తికెరెలోని సుందర్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. కుమారుడి మరణ వార్త వినిగానే 74 ఏళ్ల చెన్నవీరప్ప దు:ఖంలో మునిగిపోయారు. స్థానికులంతా కంటతడి పెట్టారు. కాల్పులకు ముందు కుమారుడు భరత్ ఫోన్ చేసి.. కాశ్మీర్ అందాలు వీడియో కాల్‌లో చూపించాడని చెన్నవీరప్ప గుర్తుచేశారు. మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు మరణవార్త తెలిసిందన్నారు. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటలకు మరణవార్త తెలిసిందన్నారు. పెద్ద కొడుకు ప్రీతమ్, కోడలికి మరణవార్త ముందుగానే తెలుసని.. కంగారు పడతామని తమకు చెప్పలేదని వాపోయాడు. మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో పెద్ద కొడుకు ప్రీతమ్ కాశ్మీర్‌కు బయల్దేరాడని.. భరత్ గాయపడ్డాడని చెప్పి కాశ్మీర్ వెళ్లాడన్నారు. చెన్నవీరప్ప భార్య శైలకుమారి(72)కి కుమారుడి మరణవార్త తెలియక.. కుమారుడు క్షేమంగా రావాలని ప్రార్థించింది. తన కుమారుడికి హిందీ నటుడు భరత్ భూషణ్ పేరు పెట్టినట్లు చెన్న వీరప్ప తెలిపారు.

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్, బెంగళూరుకు చెందిన భరత్ భూషణ్ భౌతికకాయాలు ప్రస్తుతం ఇళ్లకు చేరాయి. స్థానిక నేతలంతా బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. తామంతా అండగా ఉంటామని నేతలు భరోసా ఇచ్చారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య భౌతికకాయాలకు నివాళులు అర్పించారు.

ఇది కూడా చదవండి: Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే..’’. పాక్ మాజీ మంత్రి సంచలన పోస్ట్..