NTV Telugu Site icon

BJP MLA: “ముస్తఫాబాద్” పేరుని “శివపురి”గా మారుస్తాం.. ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే..

Bjp Mla Mohan Singh Bisht

Bjp Mla Mohan Singh Bisht

BJP MLA: ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ అధికారాన్ని చేపట్టబోతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గానూ 48 సీట్లలో బీజేపీ గెలిచింది. ఆప్ 22 స్థానాలకే పరిమితమైంది. గత పదేళ్ల ఆప్ అధికారానికి బీజేపీ బ్రేకులు వేసింది. ఇదిలా ఉంటే, తాజాగా ముస్తఫాబాద్ నుంచి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే మోహన్ సింగ్ బిష్త్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ముస్తఫాబాద్ పేరుని ‘‘శివపురి’’ లేదా ‘‘శివ విహార్’’గా మారుస్తామని ప్రకటించారు.

40 శాతం ముస్లిం ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. బిష్త్ ఆప్ అభ్యర్థి అదీల్ అహ్మద్ ఖాన్, ఎంఐఎం తాహిర్ హుస్సేన్‌లను ఓడించారు. కరవాల్ నగర్ నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన బిష్త్, ఈ సారి ముస్తఫాబాద్ నుంచి పోటీ చేశారు. ముస్లింలు ఎక్కువగా ఉండే ఈ స్థానం నుంచి పోటీ చేయమని కోరిన సందర్భంలో తాను అంత సంతోషంగా లేనని బిష్త్ అన్నారు.

Read Also: Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…

“నా సీటు (కారావాల్ నగర్) మారినప్పుడు నేను బాధపడ్డాను ఎందుకంటే ఐదుసార్లు ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా నా ప్రజల కోసం నేను చాలా కష్టపడ్డాను. నేను 17 సంవత్సరాల తర్వాత ఈ స్థానానికి (ముస్తఫాబాద్) తిరిగి వచ్చాను. పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ నేనే గెలుస్తానని తెలుసు’’ అని బిష్త్ అన్నారు. ముస్తఫాబాద్ పేరు కారణంగా ఇక్కడ వేరే వారు, చదువుకున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి స్థిరపడేందుకు ఇష్టపడరని చెప్పారు. అందుకే దీని పేరుని శివపురి లేదా శివ విహార్‌గా మారుస్తానని చెప్పారు.

నిజానికి అధికారిక డేటా ప్రకారం.. ఇక్కడ 45 శాతం ముస్లింలు ఉన్నారని, అయితే గ్రౌండ్ లెవల్‌లో ఇది 60 శాతం ముస్లింలు, 40 శాతం హిందువలు ఉన్నట్లుగా గుర్తించానని బిష్త్ చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రవేశపెట్టడం ద్వారా చెలరేగిన 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ముస్తఫాబాద్ అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటి. చాలా ఇళ్లు, దుకాణాలు, మతపరమైన ప్రదేశాలపై దాడులు జరిగాయి. చాలా మంది ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్లారు.