NTV Telugu Site icon

Merchant Navy officer Murder: ఇది భార్య కాదు, మానవ మృగం.. పక్కా ప్లాన్, లవర్‌‌ని నమ్మించి భర్త హత్య..

Meerut Murder

Meerut Murder

Merchant Navy officer Murder: మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ని భార్య ముస్కాన్ రస్తోగి తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేసింది. ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది.  విదేశాల నుంచి తన ఆరేళ్ల పాప పుట్టిన రోజు కోసం వచ్చిన సౌరభ్‌ని ముస్కాన్, సాహిల్ కత్తితో పొడిచి, 15 ముక్కలుగా చేసి డ్రమ్ములో పడేశారు. దీనిపై సిమెంట్‌తో మూసేశారు. మార్చి 04న జరిగిన హత్య తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తని ఇంత దారుణంగా చంపడంతో, ఆమె భార్యనా..? మానవ మృగమా..? అంటూ అందరూ అసహ్యించుకుంటున్నారు.

లవర్‌ని వశం చేసుకుని:

అయితే, ఈ హత్యలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్తని చంపేందుకు ముస్తాన్ గతేడాది నవంబర్ నుంచే ప్లాన్ చేస్తోందని తెలిసింది. చికెన్ కోసేందుకు అని చెప్పి, రెండు కత్తులను ఈ ఏడాది ఫిబ్రవరిలో కొనుగోలు చేసినట్లు తేలింది. ముస్కాన్, సాహిల్ ఇద్దరు క్రమం తప్పకుండా డ్రగ్స్ వాడేవారు, అయితే సౌరభ్‌కి ఈ విషయం తెలిస్తే తాను డ్రగ్స్ తీసుకోవడం అడ్డుకుంటాడనే ఒక కారణంలో హత్య చేసినట్లు తెలుస్తోంది.

మరో దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే, సాహిల్ డ్రగ్స్‌కి బానిస కావడంతో అతడిని ముస్కాన్ నమ్మించి హత్యకు ఉసిగొల్పింది. చనిపోయిన సాహిల్ తల్లి, సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ స్నాప్‌చాట్ ద్వారా మాట్లాడుతుందని సాహిల్‌ని నమ్మించింది. సాహిల్‌ని తన వశం చేసుకుని హత్యకు పురిగొల్పింది. అయితే, ఆ అకౌంట్ సాహిల్ తల్లి పేరు మీద లేదు, కానీ తల్లి పునర్జన్మ ఎత్తి అతడితో మాట్లాడుతోందని నమ్మించే విధంగా మెసేజ్‌లు పంపింది. ఈ మార్గం ద్వారా భర్త సౌరభ్‌ని చంపడానికి సాహిల్‌ని ఒప్పించింది. ఈ మొత్తం కుట్రని ముస్కానే చేసిందని మీరట్ సిటీ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ అన్నారు.

పక్కా ప్లాన్:

సౌరభ్‌ని చంపడానికి నిర్ణయించిన తర్వాత, ముస్కాన్ మృతదేహాన్ని ఎక్కడ పాతిపాతిపెట్టవచ్చో అని వెతకడం ప్రారంభించింది. పూజకోసం ఉపయోగించిన వస్తువుల్ని ఎక్కడ పాతిపెట్టాలో చెప్పాలి అని ముస్కాన్ తన ఫ్రెండ్స్‌ని అడిగింది. అయితే, ఆమె స్నేహితులు ఆమెకు చోటు దొరకడంలో సాయం చేయలేదు. 2023 నుంచి లండన్‌లో పనిచేస్తున్న సౌరభ్ ఫిబ్రవరిలో తన ఆరేళ్ల కుమార్తె పుట్టిన రోజు వస్తున్నాడని తెలుసుకున్న ముస్కాన్ పక్కా ప్లాన్‌తో హత్య చేసేందుకు సిద్ధమైంది.

ఫిబ్రవరి 22న, ఆమె చికెన్ కొయడానికి రెండు కత్తులను కొనుగోలు చేసింది. సౌరభ్ మత్తులోకి జారుకునేందుకు ఇంటర్నెట్లో వెతికి, వాటిని కొనుగోలు చేసిందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 24న సౌరభ్ తిరిగి వచ్చాడని, మరుసటి రోజు ముస్కాన్ తన మద్యంలో మందులు కలిపాడని, కానీ అతను తాగలేదని పోలీసులు తెలిపారు. అవకాశం కోసం వెతికిన ముస్కాన్, సాహిల్ మార్చి 04న సౌరభ్‌కి మత్తు మందు ఇచ్చి కత్తితో పొడిచి చంపారు.