NTV Telugu Site icon

Kunal Kamra: కునాల్ కమ్రా కేసులో ప్రేక్షకులకు పోలీసులు నోటీసులు.. ‘సారీ’ చెప్పిన కమెడియన్

Kunalkamra6

Kunalkamra6

స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా కేసు ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండేను ఉద్దేశించి కునాల్ కమ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శివసేనను చీల్చిన ‘ద్రోహి’ అంటూ సంబోధించారు. ఈ వ్యాఖ్యలే కునాల్ కుమ్రాను ఇరకాటంలో పడేశాయి. ఆయనపై మహారాష్ట్రలోని పలు స్టేషన్లలో శివసేన కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఇక కునాల్‌పై నమోదైన కేసుల్లో భాగంగా ఆయనకు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. కానీ కునాల్ కమ్రా స్పందించలేదు. ఇక మద్రాస్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం కునాల్ కమ్రా పుదుచ్చేరిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: HMD 130 Music, HMD 150 Music: యూపీఐ సపోర్ట్ తో.. HMD నుంచి రెండు కొత్త ఫీచర్ ఫోన్‌లు విడుదల

ఇదిలా ఉంటే తాజాగా కునాల్ కమ్రా షోకు హాజరైన బ్యాంకర్‌కు ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన కేరళ, తమిళనాడు పర్యటనలు వాయిదా వేసుకుని విచారణకు హాజరుకావాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ‘ఎక్స్’ ట్విట్టర్‌ ద్వారా వాపోయాడు. సమన్లు కారణంగా సెలవు ప్లాన్‌ను ముందుగా ముగించుకుని ముంబై రావల్సి వచ్చిందని పేర్కొన్నాడు.

‘‘నేను మార్చి 21న ముంబై నుంచి బయలుదేరి ఏప్రిల్ 6న తిరిగి రావాల్సి ఉంది. కానీ నేను తమిళనాడులో ఉన్నప్పుడు పోలీసుల నుంచి పదే పదే ఫోన్ కాల్స్ రావడంతో మధ్యలోనే తిరిగి ముంబై రావల్సి వచ్చింది. ఫోన్ చేసిన అధికారి.. బెదిరింపు ధోరణితో నా ప్రయాణంపై అనుమానంతో ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయాల్సి వస్తుందని బెదిరించాడు. ఈ కారణంతో త్వరగా ప్రయాణాన్ని ముగించుకుని ముంబైకి తిరిగి వచ్చేశాను.’’ అని బ్యాంకర్‌ సోషల్ మీడియాలో వాపోయాడు.

‘‘కునాల్ కమ్రా షో కోసం ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేస్తున్నాను. అందుకు సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. కునాల్ వీడియోను ఎడిట్ చేశానని పోలీసులు అంటున్నారు. అయినా షో వీడియోను నాకు ఎందుకు (ఎడిటింగ్ కోసం) అప్పగిస్తారు.’’ అని బ్యాంకర్ ప్రశ్నించారు.

తన షో కారణంగా అసౌకర్యానికి గురైన ప్రేక్షకులకు కునాల్ కమ్రా క్షమాపణలు చెప్పారు. విచారణ తర్వాత ప్రయాణ ఏర్పాట్లు చేస్తానని బ్యాంకర్‌కు కునాల్ ఆఫర్ ప్రకటించారు. తనకు మెయిల్ చేయాలని.. దేశంలో ఎక్కడికైనా తదుపరి ప్రయాణ ఏర్పాట్లు చేస్తానని కునాల్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే ప్రేక్షకులకు నోటీసులు జారీ చేసినట్లు వచ్చిన వార్తలను ముంబై పోలీసులు ఖండించారు. తాము ఎవరికీ నోటీసులు జారీ చేయలేదని.. కేవలం సాక్షిగా మాత్రమే బ్యాంకర్‌ను పిలిచినట్లు స్పష్టం చేశారు. దర్యాప్తు అధికారి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్‌లో కలవమని మాత్రమే చెప్పారని.. అనంతరం కొన్ని పరిణామాల తర్వాత తిరిగి బ్యాంకర్‌కు ఫోన్ చేసి వెంటనే హాజరుకావల్సిన అవసరం లేదని చెప్పినట్లుగా తెలిపారు. అవసరమైనప్పుడు కాల్ చేసి స్టేట్‌మెంట్‌ను తీసుకుంటామని బ్యాంకర్‌కు అధికారి చెప్పినట్లుగా ముంబై పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: RK Roja: అరెస్టులు చేస్తే చేసుకోండి..! చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌పై రోజా హాట్‌ కామెంట్స్..