NTV Telugu Site icon

Mumbai Hit-And-Run: ముంబైలో హిట్ అండ్ రన్ కేసు.. శివసేన (షిండే) నాయకుడు కొడుకు కోసం గాలింపు..!

Hit And Run

Hit And Run

Mumbai Hit-And-Run: మహారాష్ట్రలో జ‌రిగిన బీఎండ‌బ్ల్యూ కారు ప్రమాదం కేసులో నిందితుడి కోసం పోలీసులు వెతుకుతున్నారు. ప్రమాదానికి కార‌ణ‌మైన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన (షిండే) వర్గానికి చెందిన లీడర్ రాజేష్ షా కుమారుడు మిహిర్ షా కోసం గాలిస్తున్నారు. అయితే, ప్రమాదం జరిగే సమయంలో మిహిర్ షానే కారుని నడిపినట్లు తేలింది. యాక్సిడెంట్ చేసిన తర్వాత నిందితుడు పరార్ కావడంతో.. అతడి కోసం ఆరు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఘటన జరిగిన టైంలో నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇప్పటికే, మిహిర్ షాపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడంతో పాటు అతడి ఇంటికి తాళం వేసి ఉందని పోలీసులు చెప్పుకొచ్చారు. నిందితుడి తల్లి, సోదరి ఆచూకీ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

Read Also: Dark Chocolate Benefits: మీరు ఆర్యోగ్యంగా ఉండాలనుకుంటున్నారా?.. అయితే ఈ చాక్లెట్ తినాల్సిందే!

అయితే, నిందితుడి తండ్రి రాజేష్ షా, అతని డ్రైవర్ రాజరుషి బిదావత్‌లను పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం జరగ్గా.. సాయంత్రం ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పోలీసులకు సహకరించకపోవడం వల్లే శివసేన నేత రాజేష్ షాను అరెస్టు చేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితుడు రాజకీయ నేత కుమారుడు కావడంతో ఒక్కసారిగా ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఇకపోతే, నిందితుడిపై కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం.. నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం లాంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు రాజేష్‌ షా పేరుతో ఉండటంతో పాటు ప్రమాదం జరిగాక నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ట్రై చేసినట్లు విచారణలో తేలింది.