Site icon NTV Telugu

Mukhtar Ansari Death: ముఖ్తార్ అన్సారీపై చర్యలు తీసుకున్నందుకు 15 రోజుల్లో రాజీనామా చేయించారు: మాజీ డీఎస్పీ

Mukhtar Ansari Death

Mukhtar Ansari Death

Mukhtar Ansari Death: గ్యాంగ్‌స్టర్, మాజీ పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ గుండెపొటుతో నిన్న జైలులో మరణించారు. అయితే, ఒకప్పుడు యూపీ రాజకీయాల్లో వెలుగువెలిగిన ఇతనికి అప్పటి ప్రభుత్వాలు ఎలా రక్షణగా నిలిచాయనే విషయాన్ని మాజీ పోలీస్ అధికారి వెల్లడించారు. అన్సారీపై చర్యలు తీసుకున్నందుకు తాను ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాననే విషయాన్ని చెప్పారు. మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్ ముఖ్తార్ అన్సారీ నుంచి లైట్ మిషిన్ గన్ రికవరీ చేయడంతో పాటు అతనిపై ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్(పోటా) కింద కేసులు నమోదు చేశారు.

ఈ పరిణామం తర్వాత తాను 15 రోజుల్లోనే రాజీనామా చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ములాయం సింగ్ నేతృత్వంలోని అప్పటి ప్రభుత్వం తనని బలవంతంగా రాజీనామా చేసేలా చేసిందని తెలిపారు. అన్సారీపై చర్యలు తీసుకోవడంతోనే తన కెరీర్ ముగిసిందని చెప్పారు. అన్సారీ నుంచి మిషన్ గన్ స్వాధీనం చేసుకున్నది తానే అని అన్నారు. ‘‘ఈ విషయంలో ములాయం సింగ్ ప్రభుత్వం అతడిని రక్షించాలను కుంది. ఐజీ, డీఐజీ, ఎస్టీఎఫ్ ఎస్పీ బదిలీ చేయబడ్డారు. నేను 15 రోజుల్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. కానీ నా రాజీనామాలో నేను కారణాలు రాశాను. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మాఫియాను కపాడుతోంది, వారి కోసం పనిచేస్తుంది. నేను ఎవరికీ మేలు చేయలేదు, నా డ్యూటీ చేశాను’’ అని మాజీ పోలీస్ అధికారి చెప్పారు.

Read Also: Navneet Rana: అమిత్ షాను కలిసిన నవనీత్ కౌర్ దంపతులు

ఫిబ్రవరి 2004లో, రాజకీయ ఒత్తిళ్లతో శైలేంద్ర సింగ్ సేవకు రాజీనామా చేయవలసి వచ్చింది. కొన్ని నెలల తర్వాత అతడిపై విధ్వంసం కేసు నమోదైంది. మే 2021లో ఆయనపై మోపిన కేసును యూపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అన్సారీపై తాను చర్యలు తీసుకున్న కారణంగానే అప్పటి ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు తనను వేధించారని, చివరకు రాజీనామా చేసి, కేసుల్ని ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు.

చివరకు తాను క్వార్టర్స్ ఖాళీ చేసిన తర్వాత ఇళ్ల చూసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొన్నానని తెలిపారు. టీచరైన తన భార్య సంపాదించే డబ్బుపై ఆధారపడ్డానని చెప్పారు. యోగి ఆదిత్యనాథ్, అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి తన పరిస్థితి గురించి అడిగారని చెప్పారు. శైలేంద్ర సింగ్ కొంతకాలం రాజకీయాల్లో ఉన్నారు. 2006లో కాంగ్రెస్, 2014లో బీజేపీ నుంచి పోటీ చేసి విఫలమయ్యారు. ప్రస్తుతం రాజకీయాలు వదిలి గోవుల ఆశ్రమాన్ని నిర్వహిస్తూ, సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు.

Exit mobile version