The Kerala Story: ఒక యువకుడితో రిలేషన్ లో ఉన్న మహిళ ‘‘ ది కేరళ స్టోరీ’’ చూసిన తర్వాత అతడిపై ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు 23 ఏళ్ల యువకుడిని ఇండోర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై అత్యాచారం చేశాడని, మతం మారాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బలవంతంగా మోసం చేయడం ద్వారా మతమార్పిడిని నిషేధించే మధ్యప్రదేశ్ మతస్వేచ్ఛ చట్టం-2021, ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఖజ్రానా పోలీస్ స్టేషన్ అధికారి దినేష్ వర్మ తెలిపారు. ప్రేమ పెళ్లితో సదరు యువతిని మభ్యపెట్టాడని యువతి, సదరు యువకుడిపై ఫిర్యాదు చేసింది. వీరిద్దరు లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్నట్లు దినేష్ వర్మ తెలిపాడు.
Read Also: Guyana : స్కూల్ హాస్టల్లో ప్రమాదం.. 20 మంది పిల్లలు అగ్నికి ఆహుతి
ఇటీవల యువతీ, యువకుడు కలిసి ‘ది కేరళ స్టోరీ’ సినిమాకు వెళ్లారు. అయితే సినిమా చూసిన తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సదరు యువకుడు, యువతిపై దాడి చేశాడు. దీంతో ఆమె అతనిపై కేసు పెట్టింది. నిందితుడు కేవలం ఇంటర్ పాసై నిరుద్యోగిగా ఉండగా.. యువతి విద్యావంతురాలు.. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓ కోచింగ్ సెంటర్లో చదువుకుంటున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది.
ఇటీవల దేశవ్యాప్తంగా విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ సంచలన సృష్టిస్తోంది. వివాదాస్పదం అయిన ఈ సినిమా రూ.200 కోట్ల వసూళ్లను సాధించింది. కేరళలో ప్రేమ, పెళ్లి పేరుతో హిందూ, క్రిస్టియన్ యువతులను ఇస్లాంలోకి మారుస్తున్నారని, ఉగ్రవాద సంస్థ ఐసిస్ లో పనిచేసేలా చేస్తున్నారనే ఇతివృత్తంతో ఈ సినిమా వచ్చింది. పశ్చిమ బెంగాల్ ఈ సినమాను బ్యాన్ చేసింది. తమిళనాడు ప్రభుత్వం మల్టీప్లెక్సుల్లో ఈ సినిమాను నిషేధించింది. మరోవైపు బీజేపీ పాలిత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను మినహాయింపులు ఇచ్చారు.