Site icon NTV Telugu

PaniPuri Effect: పానీపూరి తిని 100 మందికి అస్వస్థత.. డయేరియాగా అనుమానిస్తున్న వైద్యులు

Panipuri

Panipuri

PaniPuri Effect: వర్షాకాలంలో రోడ్లపై విక్రయించే పానీపూరి తినవద్దని వైద్యులు సూచిస్తున్నా చాలా మంది పెడచెవిన పెడుతున్నారు. తాజాగా పానీపూరి తిని 100 మందికి పైగా అస్వస్థతకు గురైన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. హుగ్లీ జిల్లా డొగాచియాలోని ఓ స్టాల్ వద్ద పానీపూరీ తిన్నవారిలో చాలామందికి వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చాలామంది తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. భారీ సంఖ్యలో ప్రజలు అస్వస్థతకు గురికావడంతో ప్రత్యేక వైద్య బృందం ఘటన జరిగిన ప్రాంతంలో వైద్య పరీక్షలు నిర్వహించగా డయేరియాగా డాక్టర్లు అనుమానిస్తున్నారు.

Read Also: జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

కాగా అస్వస్థతకు గురైన వారంతా డొగాచియా, బహిర్ రణగచ, మకల్తాలా గ్రామాలకు చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఓ దుకాణంలో పానీపూరి తిన్న హేమంత్ అనే వ్యక్తి తొలుత అస్వస్థతకు గురయ్యాడని.. ఆ తర్వాత సుమారు 100 మంది బాధితులు వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలతో వరుసగా ఆస్పత్రి పాలైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అటు ప్రత్యేక వైద్య బృందం డొగాచియాలో పర్యటించి ఆరోగ్య సలహాలు, అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్‌ వంటివి పంపిణీ చేశారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో చాలా మందిని చూచురాలోని ఇమాంబర సదర్ ఆసుపత్రిలో, మిగిలిన రోగులను చందన్‌నగర్‌లోని ది మహాకుమా ఆసుపత్రిలో అధికారులు చేర్పించారు. కాగా వర్షాకాలంలో పానీపూరి బండ్ల వ్యాపారులు శుభ్రత పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. పానీపూరీకి వినియోగించే వాటర్‌ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Exit mobile version