Site icon NTV Telugu

Mood of the Nation: ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీయేకి 300+ సీట్లు.. బీజేపీకి ఎన్నంటే..?

Mood Of The Nation

Mood Of The Nation

Mood of the Nation: మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN) పోల్‌లో సంచలన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇప్పటికి ఇప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 343 సీట్లు గెలుచుకుంటుందని అంచనా వేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 232 సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 188 సీట్లకు పడిపోతుందని చెప్పింది.

ఇండియా టుడే-సివోటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్‌ను జనవరి 2 మరియు ఫిబ్రవరి 9, 2025 మధ్య నిర్వహించారు, అన్ని లోక్‌సభ నియోజకవర్గాలలో 125,123 మంది వ్యక్తులను సర్వే చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 293 సీట్లు గెలుచుకున్న ఎన్డీయే కూటమికి, మ్యాజిక్ ఫిగర్(272) కన్నా కొన్ని సీట్లు మాత్రమే అధికంగా గెలుచుకుని మూడోసారి అధికారాన్ని సాధించింది. తాజా పోల్ ప్రకారం, మరో 3 శాతం పాయింట్లు పెరిగి ఎన్డీయే కూటమికి ఓట్ల శాతం 47 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. ఇండియా కూటమికి 1 శాతం ఓట్లు తగ్గుతాయని చెప్పింది.

Read Also: Kids Using Mobile: మీ పిల్లలు ఫోన్ ఎక్కువగా చూస్తున్నారా? అయితే వారికి మాటలు రావు..

ఈ సర్వే బీజేపీకి గణనీయమైన పెరుగుదలను సూచించింది. నేడు ఎన్నికలు జరిగితే బీజేపీకి సొంతగా 281 సీట్లు వస్తాయని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 99 నుంచి 78 సీట్లకు పడిపోయే అవకాశం ఉందని చెప్పింది. బీజేపీకి 3 శాతం ఓట్లు పెరిగి 41 శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది.

2024 ఎన్నికల్లో ఎన్డీయే కూటమి, ముఖ్యంగా ‘‘400 పార్’’ నినాదం ఇచ్చింది. చివరకు ఈ నినాదమే ప్రతిపక్ష ఇండియా కూటమికి కలిసి వచ్చింది. 400 సీట్లు వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని మారుస్తుందని ప్రచారం చేసింది. చివరకు ఎన్డీయే కూటమి మిత్రపక్షాలైన టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ సాయంతో 293 సీట్లను సాధించింది. బీజేపీ కేవలం 240 సీట్లలో గెలుపొందింది. సొంతగా మ్యాజిక్ ఫిగర్ దాటలేకపోయింది.

Exit mobile version