Monsoon 2026: దేశంలో భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) చల్లని కబురు చెప్పింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయం కంటే ముందే భారత్‌ను పలకరించనున్నాయి. కేరళ తీరాన్ని మే 26వ తేదీనే రుతుపవనాలు తాకే అవకాశం ఉందని ఐఎమ్‌డీ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా జూన్ 1న రావాల్సిన రుతుపవనాలు.. ఈసారి ఆరు రోజుల ముందే రావడం గమనార్హం. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి, ఉక్కపోత నుంచి జనాలకు పెద్ద ఎత్తున ఉపశమనం లభించనుంది. అలాగే ఖరీఫ్ పంటలు వేయడానికి రైతులకు అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి.
వాతావరణ శాఖ అంచనాలు ఎంతవరకు నిజం..
భారత ప్రధాన భూభాగంపై నైరుతి రుతుపవనాల విస్తరణను అంచనా వేయడానికి కేరళలో వాటి ఆరంభాన్ని వాతావరణ శాఖ కీలక సూచికగా పరిగణిస్తుంది. ఇది వేడి, పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి మారే ప్రక్రియను సూచిస్తుంది. రుతుపవనాలు క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణించే కొద్దీ దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయి. రుతుపవనాల రాకపై ఐఎమ్‌డీ ఇచ్చే ముందస్తు అంచనాలు చాలా వరకు కచ్చితమైనవిగా రుజువయ్యాయి. గత ఆరేళ్ల డేటాను పరిశీలిస్తే వాతావరణ శాఖ విశ్వసనీయత స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం 2015లో మాత్రమే అంచనా తప్పింది.
2020: జూన్ 1న మాన్‌సూన్ రాక (అంచనా: జూన్ 5)
2021: జూన్ 3న మాన్‌సూన్ రాక (అంచనా: మే 31)
2022: మే 29న మాన్‌సూన్ రాక (అంచనా: మే 27)
2023: జూన్ 8న మాన్‌సూన్ రాక (అంచనా: జూన్ 4)
2024: మే 30న మాన్‌సూన్ రాక (అంచనా: మే 31)
2025: మే 24న మాన్‌సూన్ రాక (అంచనా: మే 27)
ఈ ఏడాది అంచనాకు ఆధారం ఇదే..
ఈసారి మే 26న రుతుపవనాలు వస్తాయని ఐఎమ్‌డీ శాస్త్రవేత్తలు నిర్ధారించడానికి ఆరు ప్రధాన వాతావరణ సూచికలను క్షుణ్ణంగా విశ్లేషించారు. అవి ఏంటంటే.. వాయువ్య భారతదేశంలో నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు, దక్షిణ ద్వీపకల్పంలో కురుస్తున్న రుతుపవన ముందస్తు వర్షాలు, దక్షిణ చైనా సముద్రం మీదుగా వెలువడే దీర్ఘ తరంగ వికిరణం (OLR), ఆగ్నేయ హిందూ మహాసముద్రంలో దిగువ ట్రోపోస్పియరిక్ గాలుల కదలికలు, నైరుతి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతం యొక్క OLR, ఈశాన్య హిందూ మహాసముద్రం మీదుగా వీస్తున్న దిగువ ట్రోపోస్పియరిక్ గాలులు.
కేరళకు భారీ వర్ష హెచ్చరికలు
రుతుపవనాల రాకకు ముందే దక్షిణ భారతదేశంలో వర్షాల తీవ్రత పెరుగుతోంది. ఈరోజు (మే 15) కేరళలోని ఇడుక్కి, మలప్పురం జిల్లాలకు వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. వీటితో పాటు కొట్టాయం, ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. రుతుపవనాలు ముందుగానే రావడం వల్ల దక్షిణ భారతదేశంలో ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లబడుతుంది. ఇది ఖరీఫ్ సీజన్ పంటలైన వరి, మొక్కజొన్న, పప్పుధాన్యాల సాగుకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సకాలంలో వర్షాలు పడటం వల్ల రైతులు తమ పంటలను ముందస్తుగానే విత్తుకోవడానికి వీలవుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు.
