Site icon NTV Telugu

Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. ఢిల్లీలో రెండో కేసు నమోదు

Monkeypox Cases In India

Monkeypox Cases In India

Nigerian Man Tests Positive For Monkeypox In Delhi: ప్రపంచాన్ని వణికిస్తున్న మంకీపాక్స్ వ్యాధి ఇండియాలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికి కూడా మంకీపాక్స్ అటాక్ అవుతోంది. తాజాగా దేశంలో మరో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఢిల్లీలో ఓ నైజీరియన్ జాతీయుడికి ఈ వ్యాధి సోకింది. 35 ఏళ్ల నైజీరియన్ గత ఐదు రోజులుగా శరీరంపై దద్దర్లు, జ్వరం రావడంతో ఢిల్లీలోని లోక్ నాయక్ ఆస్పత్రిలో చేరాడు. బాధితుడి శాంపిళ్లను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. తాజాగా సోమవారం వచ్చిన రిపోర్టులో అతనికి పాజిటివ్ గా తేలింది. మరో ఇద్దరు ఆఫ్రికన్ జాతీయులు కూడా మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

దేశంలో ఇప్పటి వరకు 6 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో ఢిల్లీలో 2 కేసులు నమోదు అయ్యాయి. అయితే ఢిల్లీలో వచ్చిన రెండు కేసులు కూడా ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేని వారికే వచ్చింది. బాధితులిద్దరు ఢిల్లీని వదిలి ఇతర దేశాలకు కానీ.. ఇతర ప్రాంతాలకు కానీ ప్రయాణించిన చరిత్ర లేదు. ఇక కేరళలో వచ్చిన మూడు మంకీపాక్స్ కేసుల్లో బాధితులంతా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన వారే. తాజాగా కేరళ త్రిస్సూర్ కు చెందిన వ్యక్తి మంకీపాక్స్ తో బాధపడుతూ మరణించాడు. దీంతో దేశంలో తొలి మంకీపాక్స్ మరణం నమోదు అయింది. ప్రస్తుతం మరణించిన వ్యక్తితో సంబంధం ఉన్న మొత్తం 20 మంది కేరళ ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది.

Read Also: Madhya Pradesh: అమానవీయ ఘటన.. అంబులెన్స్ లేక బైక్ పై తల్లి శవంతో స్వగ్రామానికి

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 78 దేశాల్లో 18000కు పైగా మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఆదివారం ఒక్క స్పెయిన్ దేశంలోనే మంకీపాక్స్ తో ఇద్దరు మరణించారు. స్పెయిన్ తో పాటు బ్రిటన్, బెల్జియం దేశాల్లో ఎక్కవ మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. యూరోపియన్ దేశాల్లోనే 70 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు కాగా.. అమెరికా ప్రాంతంలో 25 శాతం మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల కాలంలో మంకీపాక్స్ కేసులు తీవ్రత పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్ఓ) గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని విధించింది. న్యూయర్క్ లో మంకీపాక్స్ వల్ల ఎమర్జెన్సీ విధించారు అమెరికా అధికారులు.

Exit mobile version