Modi Cabinet Decisions: 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే..!

  • ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ
  • కేంద్ర మంత్రి వర్గంలో పలు కీలక నిర్ణయాలు
  • 7 ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్
Modi

Modi

ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్లు, మొబైల్ ఫోన్ల తయారీ, ఎరువుల ఉత్పత్తి, రైల్వే విస్తరణ వంటి రంగాలకు చెందిన ఏడు ప్రధాన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) 2.0 రెండో దశకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ దశ కోసం రూ.1.27 లక్షల కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. తొలి దశలో రూ.76 వేల కోట్ల కేటాయింపుతో పోలిస్తే ఈసారి గణనీయంగా నిధులు పెంచడం విశేషం.

ISM 2.0లో కేవలం సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్లను ఆకర్షించడం మాత్రమే కాకుండా.. దేశీయంగా పూర్తి సెమీకండక్టర్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా సెమీకండక్టర్ తయారీ పరికరాలు, ప్రత్యేక రసాయనాలు, కీలక ముడి పదార్థాలు, అధునాతన చిప్ ప్యాకేజింగ్ టెక్నాలజీల దేశీయ తయారీకి ప్రోత్సాహం ఇవ్వనుంది. దీంతో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో దిగుమతులపై ఆధారపడటం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చి 31న ప్రధాని మోడీ సెమీకండక్టర్ రంగంపై ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యాలను వివరించారు. దేశీయ, అంతర్జాతీయ సరఫరా గొలుసుల్లో భారత్ కీలక భాగస్వామిగా ఎదిగేలా పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. ప్రస్తుతం సుమారు 50 బిలియన్ డాలర్ల విలువ ఉన్న భారత సెమీకండక్టర్ మార్కెట్.. ఈ దశాబ్దం ముగిసే నాటికి 100 బిలియన్ డాలర్లకు పైగా చేరుతుందని, దేశీయ అవసరాలను భారత్‌లోనే ఎక్కువగా తీర్చే దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

2026-27 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ISM 2.0ను ప్రకటించారు. రెండో దశలో సెమీకండక్టర్ తయారీ పరికరాలు, ముడి పదార్థాలు, పూర్తి స్థాయి చిప్ డిజైన్ సామర్థ్యాలు, సరఫరా గొలుసు భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు.

కొత్త దశలో మూడు ప్రధాన లక్ష్యాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. మొదటిగా ఉత్పత్తులను మార్కెట్‌లోకి తీసుకువచ్చే డిజైన్ కంపెనీలు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, రెండోగా పరికరాల నుంచి ముడి పదార్థాలు, టెస్టింగ్ వరకు పూర్తి సెమీకండక్టర్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడం, మూడోగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను మరింతగా పెంచడం లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో 2 నానోమీటర్ వంటి అత్యాధునిక సెమీకండక్టర్ టెక్నాలజీల వైపు కూడా భారత్ క్రమంగా అడుగులు వేస్తుందని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ISM 2.0పై అమెరికా, యూరప్, జపాన్, సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ చందక్ తెలిపారు. ప్రభుత్వాల మధ్య చర్చలు, పరిశ్రమల భాగస్వామ్యాలు, వాణిజ్య ఒప్పందాలు వేగంగా ముందుకు సాగుతున్నాయని వెల్లడించారు. దీంతో భారత్ ప్రపంచ సెమీకండక్టర్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా ఎదిగే అవకాశాలు మరింత బలపడుతున్నాయి.