NTV Telugu Site icon

Mining Contract: ఖనిజాల తవ్వకాలు ప్రైవేటుకు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం

Mining

Mining

Mining Contract: ఖనిజాల తవ్వకాలను ప్రైవేటుకు అప్పగించనున్నారు. అరుదైన, ఖరీదైన పరమాణు ఖనిజాల (అటామిక్‌ మినరల్స్‌) అన్వేషణ, తవ్వకాల్లోకి సైతం ప్రైవేటు రంగం ప్రవేశించనుంది. దేశంలో ఇప్పటి వరకు ప్రభుత్వ యాజమాన్య సంస్థలు మాత్రమే 12 పరమాణు ఖనిజాల మైనింగ్‌ను చేపట్టాడానికి వీలుండేది. ఇకపై వీటిలో ఆరు ఖనిజాల వెలికితీతను ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించిన ‘గనులు, ఖనిజాల(అభివృద్ధి, క్రమబద్ధీకరణ) సవరణ బిల్లు-2023ను శుక్రవారం లోక్‌సభ ఆమోదించింది. మణిపూర్‌లో శాంతిభద్రతల వైఫల్యంపై విపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఈ బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.

Read also: Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కి బాంబు బెదిరింపు.. తీరా చూస్తే..

విద్యుత్‌ వాహనాల బ్యాటరీల తయారీకి వినియోగించే లిథియంతో పాటు బెరీలియం, నియోబియం, టైటానియం, టాంటలం, జిర్కోనియం ఖనిజాల వెలికితీతను ప్రైవేటు రంగానికి అప్పగించేందుకు ఈ బిల్లు వీలుకల్పిస్తుంది. ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్స్‌, విద్యుత్‌ బ్యాటరీల తయారీ, అంతరిక్ష రంగ పరిశ్రమ అవసరాలను ఈ ఖనిజాలు తీరుస్తాయని బిల్లు లక్ష్యాల్లో ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ సంస్థలకు రిజర్వు చేసిన జాబితా నుంచి ఈ ఆరు ఖనిజాల తవ్వకాలను తొలగించి ప్రైవేటు రంగానికి అప్పగించడం ద్వారా దేశంలో వీటి ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుందని కేంద్రం బిల్లులో పేర్కొంది. భూమి పొరల్లో చాలా లోతుల్లో ఉండే బంగారం, వెండి, రాగి, జింక్‌, లెడ్‌, నికెల్‌, కొబాల్ట్‌, ప్లాటినం, వజ్రాలు తరహా ఖనిజాల వెలికితీత చాలా కష్టమైన, ఖరీదైన వ్యవహారంగా ఉంటోందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఖనిజాల కోసం కూడా విదేశాల నుంచి దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని.. వీటి అన్వేషణ, వెలికితీయడంలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించాల్సి ఉందని అభిప్రాయపడింది. ఇందుకు అవసరమైన అనుమతుల మంజూరును కూడా ప్రభుత్వం ఈ బిల్లులో ప్రతిపాదించింది. ఇప్పటి వరకూ రెండు రకాల లైసెన్సులు(కాంపోజిట్‌, మైనింగ్‌) ఇస్తున్నామని, ఇకపై పారదర్శకమైన వేలం విధానంలో ఈ ఖనిజాల తవ్వకాలను అప్పగిస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి లోక్‌సభకు తెలిపారు. సముద్ర ఇసుకలో లభించే ఖనిజాల అన్వేషణ, వెలికితీతను ప్రభుత్వ రంగ సంస్థలకే రిజర్వు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఏడాది మనదేశం 100 కోట్ల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయనుందని, తద్వారా ఇంధన రంగంలో స్వయం సమృద్ధిని సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2025-26 నుంచి థర్మల్‌ విద్యుత్‌ కోసం బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదని మంత్రి చెప్పారు.