Microsoft Outage: ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కోట్లాది మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా outlook, Microsoft Teams, Copilot వంటి సేవలను వినియోగించడంలో సమస్యలు తలెత్తడంతో వ్యాపార సంస్థలు సమస్యల్ని ఎదుర్కొన్నాయి. భారతదేశంలో వివిధ బిజినెస్‌లపై ప్రభావం కనిపించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు తమ కస్టమర్ సపోర్ట్ సిస్టమ్‌లపై ప్రభావం పడిందని ప్రయాణికులకు అలర్ట్స్ జారీ చేశాయి.
మైక్రోసాఫ్ట్ సేవల్లో సమస్య కారణంగా తమ ఈ-మెయిల్ సపోర్ట్ వ్యవస్థ ప్రభావితమైందని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు పంపే ఈ-మెయిల్స్ తమకు అందకపోవచ్చని హెచ్చరించింది. అత్యవసర సహాయం అవసరమైన ప్రయాణికులు ఇండిగో వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా 6E Skai సేవను సంప్రదించాలని సూచించింది.
మరోవైపు, మైక్రోసాఫ్ట్ సేవల్లో అంతరాయం వల్ల తమ విమాన కార్యకలాపాలు, ప్రయాణికులతో సంప్రదింపుల వ్యవస్థ ప్రభావితం కాలేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ-మెయిల్స్ పోగొట్టుకోకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఈ-మెయిల్ ట్రాఫిక్‌ను మళ్లించినట్లు వెల్లడించింది. ప్రయాణికుల నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌కు సాధారణంగా పాటించే 24 గంటల వ్యవధిలోనే సమాధానాలు ఇస్తున్నట్లు పేర్కొంది.

