మేఘాలయ హైకోర్టు గురువారం నాడు కీలక తీర్పు వెల్లడించింది. మహిళ జననాంగాన్ని లోదుస్తులపై నుంచి పురుషాంగంతో తాకినా అత్యాచారంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. 2006లో పదేళ్ల బాలిక తనపై అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం.. 2018లో నిందితుడికి ట్రయల్ కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధించింది. అప్పుడు నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నాడు.
అనంతరం నిందితుడు ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు. అంతేకాకుండా మాట మార్చి తాను బాలికను అత్యాచారం చేయలేదని.. కేవలం లోదుస్తుల పైనుంచి ఆమె జననాంగాన్ని పురుషాంగంతో తాకానని కోర్టుకు వివరించాడు. తన వాదనను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపాడు. మరోవైపు బాధితురాలు కూడా తన వాంగ్మూలాన్ని మార్చి చెప్పింది. తొలుత లోదుస్తులు తీసి నిందితుడు అత్యాచారం చేశాడని చెప్పిన బాలిక.. తర్వాత వేరేలా చెప్పింది. అయితే వైద్య పరీక్షలు, బాధితురాలి వాంగ్మూలం, నిందితుడి వివరణను పరిగణనలోకి తీసుకుని ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. నిందితుడు శిక్షకు అర్హుడేనని స్పష్టం చేసింది.
