Funny Incident: ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ఒక ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. కొత్తగా పెళ్లయిన వ్యక్తి, ‘‘ఫస్ట్ నైట్’’ రోజే అదృశ్యమవ్వడం సంచలనంగా మారింది. ఈ పరిణామం వరుడి కుటుంబీకులను ఆందోళనకు గురి చేసింది. వివాహం అయిన రోజే అదృశ్యం కావడంతో వారంతా భయపడిపోయారు. మొహిసిన్ అనే వ్యక్తికి 5 రోజుల క్రితం ముజఫర్ నగర్ లో వివాహం జరిగింది. పెళ్లి రాత్రి, అతడి భార్య గదిలో వేచి చూస్తూ ఉంది. అయితే, గది మొత్తం లైట్లు చాలా ప్రకాశవంతంగా ఉండటంతో, చిన్న బల్బు తీసుకురావాలని కోరింది.
Read Also: Bhatti Vikramarka : పనుల్లో వేగం, నాణ్యత, స్పష్టతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి
బల్బు తీసుకురావడానికి బయటకు వెళ్లిన మొహసిన్ మళ్లీ ఇంటికి రాలేదు. రాత్రి అతడి నవ వధువు, కుటుంబం మొత్తం ఎదురుచూసింది. చివరిసారిగా గంగా కాలువ సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో ఇతడి జాడ కనిపించింది. ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానంతో డైవర్లతో నీటిలో వెతికించారు. మరుసటి రోజు ఉదయం, మొహిసీన్ ఇద్దరు సోదరీమణులకు వివాహం జరిగింది. కానీ సోదరుడి జాడ లేకపోవడంతో ఆ వివాహం విషాద వాతావరణం మధ్యే జరిగింది.
అయితే, సోమవారం మొహసీన్ తన బంధువుకు ఫోన్ చేసి హరిద్వార్‌లో ఉన్నట్లు చెప్పాడు. దీంతో కుటుంబం ఊపిరి పీల్చుకుంది. కుటుంబం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కుటుంబ సభ్యులతో ఒక గ్రూప్ హరిద్వార్ వెళ్లి అతడిని సురక్షితంగా ఇంటికి తీసుకువచ్చారు. విచారణలో, మొహసీన్ వెల్లడించిన విషయంతో అంతా షాక్ అయ్యారు. తన భార్య ముందు భయపడ్డానని, ఇది తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించిందని చెప్పాడు.
