ఉక్రెయిన్‌లో ఇరవై వేల మందికి పైగా భారతీయులు ఉన్నారు. వారిలో ఎక్కువ మంది వైద్య విద్యార్ధులు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో వారిని కేంద్ర ప్రభుత్వం క్షేమంగా స్వదేశం రప్పించింది. ఐతే, కర్ణాటకకు చెందిన మెడికల్ స్టూడెండ్ నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడ తాజా ఘర్షణలకు బలయ్యాడు. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీలో నవీన్ చదువుతున్నాడు. ఈ ఘటన తరువాత ఉక్రెయిన్ వైద్య విద్య అందరి దృష్టిని ఆకర్షించింది.
భారత్‌లో మెడిసిన్ సీటు రాని వారు విదేశీ యూనివర్సిటీల వైపు చూస్తుంటారు. ఉక్రెయిన్, చైనా, రష్యా, జార్జియా, ఫిలిప్పీన్స్ లోని విశ్వవిద్యాలయాలు వారిని అధికంగా ఆకర్షిస్తున్నాయి. ఐతే, చాలా మంది ఉక్రెయిన్ పట్ల ఆసక్తి చూపుతున్నారు. దీనికి ప్రత్యేక కారణాలు ఏమైనా ఉన్నాయా?
ఫిబ్రవరి 26న ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ వైద్య విద్యను ప్రస్తావించారు. భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం చిన్న దేశాలకు వెళ్లటాన్ని ఆయన గుర్తుచేశారు. వైద్య విద్యలో ప్రైవేట్ రంగం పెద్ద ఎత్తున ప్రవేశించాలని ఆయన కాంక్షించారు. ఉక్రెయిన్ పేరు ప్రస్తావించనప్పటికీ ఈ సందర్భంలో ప్రధాని మాటలకు ప్రాధాన్యత ఏర్పడింది.
యూరప్‌లో గ్రాడ్యుయేట్, పోస్ట్-గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులలో ఉక్రెయిన్‌ది నాలుగవ స్థానం. ఉక్రెయిన్‌లో తరలింపు ప్రయత్నాలు ప్రారంభమయ్యే సమయానికి దాదాపు 18,095 మంది భారతీయ విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. 2020 లెక్కల ప్రకారం అక్కడ చదివే విదేశీ విద్యార్థులలో 24 శాతం మంది మనవాళ్లే. తాజా సంక్షోభంతో ఉక్రెయిన్ లో వైద్య విద్య అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది.
వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లడానికి ప్రధాన కారణం ఇక్కడి సీట్ల కొరత. మన ప్రైవేట్ కళాశాలలతో పోల్చినప్పుడు ఉక్రెయిన్ వంటి దేశాలలో వైద్య విద్య తక్కువ ఖర్చుతో కూడినది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం డిసెంబర్ 2021 నాటికి భారతదేశంలోని వైద్య కళాశాలలన్నిటిలో కలిపి 88,120 అండర్ గ్రాడ్యుయేట్ సీట్లు ఉన్నాయి. వాటి కోసం 15 లక్షల 44 వేల మంది ప్రవేశ పరీక్ష రాశారు. విదేశాల్లో మెడికల్ డిగ్రీని అభ్యసించాలనుకునే విద్యార్థులు కూడా (కొన్ని దేశాల్లో) ఈ పరీక్ష క్లియర్ చేయాల్సి ఉంటుంది. గత ఏడాది ఈ పరీక్షలో 8 లక్షల 70 వేల మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే, అందుబాటులో సీట్లు (88,120) అర్హత పొందిన అభ్యర్థులలో కేవలం 10 శాతం మాత్రమే.
దేశంలో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్లకు, డిమాండుకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉంది. కొంత మంది విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక పరీక్ష రాసినా..కనీసం ఐదు లక్షల మంది సీరియస్‌గా ఎంబీబీఎస్ కోర్స్ చేయాలనుకుంటారు. అప్పుడు కూడా సీట్ల కొరత భారీగానే ఉంటుంది కదా!
జాతీయ వైద్య కమిషన్ వెబ్‌సైట్ ప్రకారం దేశంలోని 284 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 43,310 ఎంబీబీఎస్ సీట్లు , 269 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 41,065 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే అందుబాటులో ఉన్న ఆ కొద్దిపాటి సీట్లలో కూడా సగం మాత్రమే ప్రభుత్వ కళాశాలల్లో ఉన్నాయి. భారతదేశంలోని ప్రైవేట్ కళాశాలలతో పోల్చినప్పుడు మోడీ ప్రస్తావించిన ఆ చిన్న దేశాలలో చదువుకోవడానికి అయ్యే ఖర్చులో భారీ తేడా కనిపిస్తుంది.
ఉక్రెయిన్, రష్యా వంటి దేశాలలో ఎంబీబీఎస్ డిగ్రీకి అయ్యే ఖర్చు మన దేశంలోని ప్రైవేట్ కళాశాలలో చదివితే అయ్యే ఖర్చు కన్నా చాలా తక్కువ. మూడింట ఒక వంతు కంటే కూడా తక్కువే. మన ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో సంవత్సరానికి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. కానీ ఉక్రెయిన్‌లో మూడు నుంచి నాలుగు లక్షలు చాలు.
భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, విద్యార్థులు ఇక్కడ మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి లైసెన్స్ కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్‌ఎమ్‌జీఈ) క్లియర్ చేయాల్సి ఉంటుంది. దానిని ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ గా మార్చే ప్రతిపాదన ఉంది. ఉక్రెయిన్ సంక్షోభం మధ్య, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి విదేశాల్లో చదువుతున్న 90 శాతం మంది భారతీయ విద్యార్థులు ఈ అర్హత పరీక్షలలో విఫలమయ్యారని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను ప్రోగ్రెసివ్ మెడికోస్ అండ్ సైంటిస్ట్స్ ఫోరమ్-పీఎంఎస్‌ఎఫ్ తీవ్రంగా విమర్శించింది.
ఉక్రెయిన్ యుద్ధంలో భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఉద్దేశించి ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని పీఎంఎస్‌ఎఫ్ తీవ్రంగా తప్పు పట్టింది. భారతదేశంలో చదవకుండా చిన్న చిన్న దేశాలకు ఎందుకు వెళతారని ప్రధాని ప్రశ్నించటాన్ని కూడా ఓ ప్రకటనలో ఫోరమ్ ఎత్తి చూపింది. దేశంలో తగినన్ని ప్రభుత్వ మెడికల్ సీట్లు అందుబాటులో లేకపోవటం, ప్రైవేట్ కాలేజీలో ఫీజులు భరించలేనంతగా ఉండటం వల్లనే వారు అక్కడికి వెళుతున్నారు. మనతో పోలిస్తే ఆయా దేశాల్లో వైద్య విశ్వవిద్యాలయాలు ఎక్కువ. పైగా అవి చాలా వరకు పూర్తిగా ప్రభుత్వ నిధులతో నడుస్తాయి. వారు తమ వద్ద ఉన్న అదనపు సీట్లను విదేశీ విద్యార్థులకు డబ్బు ప్రాతిపదికన కేటాయిస్తారు.
కేవలం వేలల్లోనే ఉన్న మెడికల్ సీట్లు లక్షలాది మంది విద్యార్థుల ఆకాంక్షలను తీర్చలేవు. ఈ సంగతి ప్రధానికి తెలియంది కాదు. కానీ ఆయనకు అది ఇప్పుడు గుర్తుకు వచ్చింది. వైద్య విద్యా రంగంలో మన ప్రైవేట్ రంగం భారీగా ప్రవేశించలేదా? దీనికి సంబంధించి భూ కేటాయింపుల కోసం మన రాష్ట్ర ప్రభుత్వాలు సరైన విధానాలను రూపొందించలేవా? అని ప్రధాని ప్రశ్నించారు. ఐతే, భారత దేశంలో వైద్య విద్యతో పాటు వైద్యం ఏ స్థాయిలో వ్యాపారంగా మారాయో ఆయన మరిచిపోయినట్టున్నారని పీఎంఎస్‌ఎఫ్ ఎద్దేవా చేసింది.
మరోవైపు, దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఉన్న వైద్య కళాశాలల సంఖ్య సమతుల్యంలో లేదు. కర్ణాటకలో అత్యధికంగా 9, 795 సీట్లకు గాను 63 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మహారాష్ట్రలో 61 కళాశాలలు, 9,600 ఎంబీబీఎస్ సీట్ల ఉన్నాయి. తమిళనాడులో 69 కాలేజీలు, 10,625 సీట్లు, తెలంగాణలో 34 కళాశాలలు, 5,340 సీట్లు. ఆంధ్రప్రదేశ్ లో 31 కళాశాలలు, 5,210 సీట్లు , ఉత్తర ప్రదేశ్ లో 67 కళాశాలలు, 8,678 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) ఎంబిబిఎస్ సీట్ల కొరతను సీరియస్‌గా తీసుకుని దేశంలో వైద్య విద్యను ఆశించే ప్రతి విద్యార్థికి తగిన అవకాశాలను అందిస్తేనే దేశంలో డాక్టర్ పేషెంట్ నిష్పత్తిని సాధించటం సాధ్యమవుతుంది. అందుకోసం ముందు రాష్ట్ర జనాభా నిష్పత్తిని బట్టి ప్రతి ఏటా సీట్లు పెంచుకుంటూ పోవాలి. దానికి తిగినట్టుగా ప్రభుత్వం కొన్నేళ్ల పాటు నిధులు కేటాయించాలి.
మరోవైపు, ప్రస్తుత విద్యా వ్యవస్థకు ప్రత్యామ్నాయాలను వెతకాల్సి అవసరం కూడా ఉంది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంలో కళాశాలలు ఏర్పాటు చేయాలి. పెద్ద పెద్ద ఆస్పత్రులు ముందుకు వచ్చి కళాశాలలు ఏర్పాటు చేసి ప్రోత్సాహకాలు అందించాలి. తద్వారా ఫీజుల భారం తగ్గించాలని ప్రభుత్వం వాటిని కోరాలి.
ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఆరేళ్లపాటు ఎంబీబీఎస్ చదవాటినికి అయ్యే మొత్తం ఖర్చు రూ. 35 లక్షల నుంచి రూ.40 లక్షలు మించదు. అదే భారతదేశంలో మేనేజ్‌మెంట్ కోటా సీటుకు 30-70 లక్షలు వసూలు చేస్తున్నారు. అన్ని ఖర్చులు కలుపుకుని కోటీ రూపాయలు దాటుతుంది. ఈ భారీ అంతరమే వారిని విదేశీ బాట పట్టిస్తోంది. అలా జరగకుండా ఉండాలన్నా, వైద్య విద్య సామాన్యుడికి కూడా అందుబాటులోకి రావాలన్నా అది ప్రభుత్వం చేతిలోనే ఉంది!!
