NTV Telugu Site icon

McDonald’s: మెక్ డొనాల్డ్స్‌కి టమాటా దెబ్బ.. బర్గర్లలో బంద్..

Mcdonald's

Mcdonald's

McDonald’s: వర్షాభావ పరిస్థితులు, హీట్ వేవ్ కారణాల వల్ల దేశంలో టమాటా పంట దెబ్బతింది. వెరసి దేశవ్యాప్తంగా టమాటా రేట్లు భగ్గుమంటున్నాయి. కిలో టమాటా ధర రూ. 200లను దాటింది. సామాన్యుడు టమాటాలను కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ చైన్ మెక్ డొనాల్డ్స్ కి కూడా టమాటా దెబ్బ తాకింది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లోని తమ స్టోర్లలో బర్గర్లు, రాప్ ల నుంచి టమాటాను తొలగించాలని నిర్ణయం తీసుకుంది.

Read Also: Supreme Court: వివాహేతర సంబంధాల రుజువుకు కాల్ రికార్డ్.. గోప్యత హక్కును ఉల్లంఘిస్తుందా..?

బర్గర్లు, రాప్ లలో టమాటాలు చాలా కీలకం.. అయితే ఇప్పుడు వాటిలో ఇవి ఉండవన్నమాట. దేశంలో సరఫరాలో సమస్యలు, టమాటా నాణ్యత దెబ్బతినడం, రికార్డు స్థాయిలో ధరల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మెక్ డొనాల్డ్స్ తెలిపింది. నెల వ్యవధిలో టమాటా ధరలు 300-400 శాతం పెరిగాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో సగటున కిలో టమాటా ధర రూ. 100ని మించింది. రిటైల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ప్రజలు టమాటా వినియోగాన్ని దాదాపుగా తగ్గించుకుంది. ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ జిల్లాలో ఏకంగా కిలో టమాటాల ధర రూ. 250కి చేరి రికార్డు సృష్టించింది.

‘‘మేము ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మా కఠిణమైన నాణ్యత తనిఖీలను ఆమోదించే టమాటాలను మేము తగినంతగా పొందలేకపోతున్నాం’’ అని న్యూఢిల్లీలోని రెండు మెక్‌డొనాల్డ్స్ స్టోర్‌లలో నోటీసులు అంటించారు. నోయిడాలోని మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్లు ఇలాంటి నోటీసులు కనిపించాయి. టమాటాలు లేకుండా తమ ఉత్పత్తులను అందించాల్సి వస్తుందని పేర్కొంది. అయితే సౌత్ ఇండియా, పశ్చిమ ప్రాంతాల్లో ఈ సమస్య లేదని చెప్పింది. వేడిగాలులు ఆ తర్వాత రుతుపవనాల ఆలస్యం టమాటా ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగించింది.