NTV Telugu Site icon

Triangle Love: ప్రాణం తీసిన ట్రయాంగిల్ లవ్.. ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య

Trianglelove

Trianglelove

కర్ణాటకలో విషాదం చోటుచేసుకుంది. ట్రయాంగిల్ లవ్ కారణంగా ఓ విద్యా కుసుమం రాలిపోయింది. ఈ ఘటన బెళగావిలోని నెహ్రూ నగర్‌లో చోటుచేసుకుంది.

విజయపురకు చెందిన ఐశ్వర్య ఎంబీఏ గ్రాడ్యుయేట్. కాలేజీలో చదివే సమయంలో ఆకాష్ చడచన్ అనే యువకుడ్ని ప్రేమించింది. అతడితో ప్రేమలో ఉంది. అయితే ఆకాష్ మాత్రం మరొక అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తీవ్ర కలత చెందడంతో మార్చి 25న సాయంత్రం 6:30-7:30 గంటల మధ్య ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఆకాష్ ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తు్న్నాడు. ఐశ్వర్య.. ఇంటర్న్‌షిప్ కోసం బెళగావికి వెళ్లింది. అయితే ఆకాష్.. మరొక అమ్మాయితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నాడని ఐశ్వర్యకు తెలిసింది. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది. అంతే ఆకాష్‌కి.. ఆమె స్నేహితురాలికి సందేశం పంపించింది. జీవితాన్ని ముగిస్తున్నట్లు సందేశంలో ఐశ్వర్య పేర్కొంది.

ఆత్మహత్యకు ముందు సీసీటీవీ ఫుటేజీలో ఐశ్వర్య దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో తన గదికి వెళ్లే ముందు స్నేహితురాలితో మాట్లాడుతుండటం కనిపించింది. ఇక మెసేజ్ అందగానే ఆకాష్ పరుగెత్తుకుంటూ వెళ్లి.. బలవంతంగా ఆమె గదిలోకి ప్రవేశించి ఐశ్వర్య ఫోన్‌లోని ఆధారాలన్నీ డిలీట్ చేశాడు.

ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆకాష్‌ను అదుపులోకి తసుకున్నారు. ఇక ఈ కేసులో ప్రమేయం ఉన్న మరో మహిళ కోసం కూడా గాలిస్తున్నారు. ఐశ్వర్య కాల్ రికార్డులను ఫోరెన్సిక్‌కు పంపించారు. మరిన్ని ఆధారాలు కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బెళగావి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ కొనసాగుతుందని.. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని బెళగావి పోలీసులు పేర్కొన్నారు.