NTV Telugu Site icon

Mayawati: తమిళనాడు బీఎస్పీ చీఫ్ దారుణ హత్య.. మండిపడిన మాయావతి

Mayavati

Mayavati

Mayawati: తమిళనాడు బీఎస్పీ అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై పార్టీ జాతీయాధ్యక్షురాలు మాయావతి స్పందించారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కె.ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నరికి చంపిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాయావతి తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు. శాంతిని కాపాడాలని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా విచారకరమైన, ఆందోళనకరమైన ఘటన అని మాయావతి పేర్కొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్‌కు నివాళులర్పించడానికి , ఆయన కుటుంబసభ్యులను కలిసి సానుభూతిని తెలపడానికి ఆదివారం చెన్నైకి వెళ్లాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులో సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ బీఎస్పీ మద్దతుదారులు నిరసనలు చేపట్టారు

“తమిళనాడులో కష్టపడి పనిచేసే, అంకితభావంతో పని చేసే బీఎస్పీ నాయకుడు, రాష్ట్ర పార్టీ యూనిట్ అధ్యక్షుడు కె. ఆర్మ్‌స్ట్రాంగ్‌ని అతని చెన్నై నివాసం వెలుపల దారుణంగా హత్య చేయడం సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే కఠినమైన/అవసరమైన చర్య తీసుకోవాలి.’ అని మాయావతి ట్వీట్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ గతంలో చెన్నై కార్పొరేషన్ కౌన్సిలర్‌గా పనిచేశారు. మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ దళితుల “బలమైన గొంతుక” అని పేర్కొన్నారు.

చెన్నైలోని పెరంబూర్ ప్రాంతంలోని ఆయన నివాసం సమీపంలో ఆర్మ్‌స్ట్రాంగ్‌ను ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. బైకులపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు ఆర్మ్‌స్ట్రాంగ్‌పై కత్తులతో దాడి చేసి రోడ్డుపై తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక నివేదికలు పేర్కొన్నాయి. నలుగురు దుండగులు ఫుడ్ డెలివరీ ఏజెంట్ల దుస్తులు ధరించారు. దాడి తరువాత, ఆర్మ్‌స్ట్రాంగ్‌ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజీవ్ గాంధీ జనరల్ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన తర్వాత ఆర్మ్‌స్ట్రాంగ్ హత్యపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఎస్పీ మద్దతుదారులు తమిళనాడు వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. హత్యను నిరోధించడంలో విఫలమైనందుకు ఏడీజీపీ(ఇంటెలిజెన్స్)ని తొలగించాలని మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. అరెస్టు చేసిన నిందితులు అసలు నిందితులు కాదని, సమగ్ర విచారణ జరిపించాలని బీఎస్పీ యూనిట్ కూడా ఆరోపించింది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సంతాపం వ్యక్తం చేస్తూ, నిందితులను న్యాయస్థానం ముందుకు తీసుకురావాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. “ఈ హత్యలో పాల్గొన్న వారిని పోలీసులు రాత్రికి రాత్రే అరెస్ట్ చేశారు. ఆర్మ్‌స్ట్రాంగ్ పార్టీ, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులందరికీ నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. కేసును త్వరితగతిన విచారించాలని పోలీసు అధికారులను ఆదేశించాను. నేరస్థులకు చట్ట ప్రకారం శిక్ష విధించాలి.’’ అని ట్వీట్‌ చేశారు.