Mathura Court Orders Survey Of Shahi Idgah Mosque After January 2: ఉత్తర్ ప్రదేశ్ మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా మసీదు వివాదంలో మథుర కోర్టు కీలక తీర్పు చెప్పింది. జనవరి 2 తర్వాత వివాదాస్పద షాహీ ఈద్గా ప్రాంతంలో భారత పురావస్తు శాఖ సర్వే చేయాలని శనివారం తీర్పును వెలువరించింది. జనవరి 20 తర్వాత నివేదిక సమర్పించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. గతంలో జ్ఞాన్‌వాపి మసీదులో సర్వే మాదిరిగానే ఈ సర్వే ఉండబోతోంది. హిందు సంస్థల తరుపున విష్ణు గుప్తా దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు ఈ ఆదేశాలను జారీ చేసింది. ఈ కేసుల తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
17వ శతాబ్ధానికి చెందిన షాహీ ఈద్గా మసీదును కత్రా కేశవ్ దేవ్ ఆలయం నుంచి తొలగించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మసీదు శ్రీ కృష్ణుడి జన్మస్థలంలో నిర్మించారని హిందు సంఘాలు పేర్కొంటున్నాయి. 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు శ్రీకృష్ణుడి ఆలయంలోని 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఈ మసీదును నిర్మించారని హిందూసంఘాలు చెబుతున్నాయి. దీంతో ఈ వివాదాస్పద స్థలంపై విష్ణుగుప్తా పిటిషన్ దాఖలు చేశారు.
Read Also: Union Health Minister: ఆ దేశాల నుంచి వచ్చేవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి
విష్ణు గుప్తా తరపు న్యాయవాది శైలేష్ దూబే మాట్లాడుతూ.. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణుగుప్తా, ఉపాధ్యక్షుడు సుర్జీత్ సింగ్ యాదవ్ డిసెంబర్8న కోర్టులో తన వాదనలు వినిపించారని.. శ్రీకృష్ణుని జననం నుండి ఆలయ నిర్మాణం వరకు మొత్తం చరిత్రను ఆయన కోర్టు ముందుంచారని.. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ వర్సెస్ షాహీ ఈద్గా మధ్య జరిగిన ఒప్పందాన్ని చట్టవిరుద్ధమని పేర్కొంటూ రద్దు చేయాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే కాశీ విశ్వనాథ్ టెంపుల్-జ్ఞాన్‌వాపి అంశం కోర్టులో ఉంది. దీనిపై కోర్టులో విచారణ జరుగుతోంది. గతంలో వారణాసి సివిల్ కోర్టు ఆదేశాలతో జ్ఞాన్‌వాపి మసీదులో వీడియోగ్రఫీ సర్వే జరిగింది. ఈ సర్వేలో మసీదులోని వాజుఖానాలోని కొలనులో శివలింగం బయటపడింది. దీంతో పాటు మసీదు వెలుపల కొన్ని హిందూ దేవీదేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నట్లు వీడియోగ్రఫీలో తేలింది. తాజాగా షాహీఈద్గా మసీదులో విషయంలో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
