NTV Telugu Site icon

Manipur: రాష్ట్రపతి పాలన మొదటి వారంలోనే.. మణిపూర్‌లో ఉగ్రవాదులపై భారీ దాడులు..

Manipur

Manipur

Manipur: ఏడాదిన్నర కాలంగా మైయిటీ, కుకీల మధ్య జాతుల ఘర్షణలో అట్టుడికుతున్న మణిపూర్‌లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడం, ఆ తర్వాత సీఎం పదవిని ఎవరూ తీసుకోకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. అయితే, రాష్ట్రపతి పాలన విధించిన తొలి వారంలోనే భద్రతా బలగాలు అక్కడి ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై భారీ అణిచివేత కార్యక్రమాలు చేపట్టారు. కేవలం వారంలోనే భద్రతా బలగాలు 30 మందికి పైగా రెబల్స్‌ని అరెస్ట్ చేశాయి. వీరిలో వివిధ ఉగ్రవాద సంస్థలకు చెందిన సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అనేక మంత్రి గ్రామ వాలంటీర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇంఫాల్ అంతటా అనేక ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి.

అరెస్టయిన ఉగ్రవాదులు కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), PREPAK, KYKL, అలాగే కుకి నేషనల్ ఆర్మీ (KNA), యునైటెడ్ నేషనల్ కుకి ఆర్మీ (UNKA) వంటి కుకి మిలిటెంట్ గ్రూపులతో సహా లోయలోని వివిధ తిరుగుబాటు గ్రూపులకు చెందినవారు ఉన్నారు. మణిపూర్‌లోని వివిధ జిల్లాల్లో జరిగిన ఆపరేషన్లలో భద్రతా బలగాలు కనీసం 15 ఐఈడీ బాంబులతో పాటు హెచ్‌కే రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఏకే సిరీస్ రైఫిల్స్‌‌తో పాటు ఆటోమేటిక్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్‌లో కాక్చింగ్ జిల్లాలో 10 మందికి పైగా గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేశారు.

Read Also: Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది

రాష్ట్రపతి పాలన అమలులోకి రావడంతో మణిపూర్ బాధ్యతల్ని కేంద్రం నేరుగా తన చేతుల్లోకి తీసుకుంది. దీంతో పారామిలిటరీ దళాలను వేగంగా మోహరించడంతో పాటు నిఘా ఆధారిత తిరుగుబాటు నిరోధక చర్యలు సాధ్యమయ్యాయి. సాయుధ ఉగ్రవాదుల కదలికల్ని నిరోధించడానికి రహదారులు, కీలక మార్గాల్లో భద్రతా తనిఖీలు ప్రారంభించారు. రాత్రి వేళల్లో సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. దోపిడీ చేసిన, చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నవారు 7 రోజుల్లో స్వచ్ఛందంగా లొంగిపోవాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా వార్నింగ్ ఇచ్చారు. దీని తర్వాత పెద్ద ఎత్తున ఆరెస్టులు జరిగాయి. గడువు ముగిసిన తర్వాత కఠిన చర్యలు ఉంటాయని గవర్నర్ హెచ్చరించారు. మరోవైపు అరెస్టులకు నిరసనగా ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను కూడా బలవంతంగా మూసివేయించారు.

మే 2023 నుంచి మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీల మధ్య సంఘర్షణ మొదలైంది. దీంతో మణిపూర్ అగ్నిగుండంగా మారింది. 220 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. హింస చెలరేగిన దాదాపుగా రెండేళ్ల తర్వాత ఫిబ్రవరి 09న మణిపూర్ సీఎంగా బిరేన్ సింగ్ రాజీనామా చేశారు. ఫిబ్రవరి 13న రాష్ట్రపతి పాలన విధించబడింది.