భారత్‌తో ఉన్న సంబంధాలకు విఘాతం కలిగించేలా పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు ఉండబోవని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో స్పష్టం చేశారు. ఏ దేశంతోనూ అమెరికా సంబంధాలు భారత్‌తో ఉన్న బంధానికి నష్టం కలిగించే విధంగా ఉండవని భరోసా ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో సంబంధాలను పెంచుకుంటున్న నేపథ్యంలో న్యూఢిల్లీలో నెలకొన్న ఆందోళనలకు రూబియో క్లారిటీ ఇచ్చారు.
ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రూబియో మాట్లాడుతూ.. భారత్-అమెరికా సంబంధాలను 1970ల నాటి నిక్సన్-కిస్సింజర్ కాలంతో పోల్చడం సరైనది కాదన్నారు. అప్పటి ప్రపంచ పరిస్థితులు, ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. 1970లలో రిచర్డ్ నిక్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెన్రీ కిస్సింజర్ జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేశారు. ఆ సమయంలో దక్షిణాసియాపై అమెరికా విధానంలో జనరల్ యాహ్యా ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ సైనిక ప్రభుత్వానికి ప్రాధాన్యం లభించింది. పాకిస్థాన్‌తో ముఖ్యంగా ఆ దేశ రక్షణ దళాల అధిపతి అసిమ్ మునీర్‌తో ట్రంప్ ప్రభుత్వం సంబంధాలను పెంచుకుంటున్న అంశంపై రూబియో స్పందించారు. “ప్రపంచంలోని ఏ దేశంతోనైనా మాకు ఉన్న సంబంధాలు.. భారత్‌తో ఉన్న సంబంధాలకు ఏ విధంగానూ నష్టం కలిగించవు. భారత్‌తో మా సంబంధాలను మేము ఆ కోణంలో చూడటం లేదు” అని స్పష్టం చేశారు. భారత్‌లో తన పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు జరుగుతున్న ప్రయత్నాలు.. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న చర్చలు, పరస్పర సహకారం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో అమెరికా సంబంధాలు కొనసాగడం వల్ల భారత్‌కు ఆందోళన కలిగించే చర్యలను నిరుత్సాహపరిచే అవకాశం కూడా ఉంటుందని రూబియో అభిప్రాయపడ్డారు.
ముగింపు అంత సులభం కాదు
రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించడంలో ఉన్న సవాళ్లను కూడా రూబియో అంగీకరించారు. “ఈ సమస్యలు చాలా సంక్లిష్టమైనవి. ఈ యుద్ధాన్ని పరిష్కరించడం సులభమై ఉంటే.. ఎప్పుడో ఒకప్పుడే ముగిసిపోయేది” అని వ్యాఖ్యానించారు.

