NTV Telugu Site icon

PAK Youtubers: అదృశ్యమైన “పాక్ యూట్యూబర్లు”.. భారత్‌ని ప్రశంసించడం పాక్ ఆర్మీకి నచ్చలేదా..?

Pak Youtubers

Pak Youtubers

PAK Youtubers: పాకిస్తాన్ ప్రభుత్వం, ముఖ్యంగా పాకిస్తాన్ ఆర్మీ అక్కడి యూట్యూబర్లను అణిచివేస్తోంది. ముఖ్యంగా భారత అభివృద్ధి, భారత విషయాలను కంటెంట్ కింద వాడుతూ, నిజాలను నిర్భయంగా చెబుతున్న ఇద్దరు ప్రముఖ యూట్యూబర్లు గత వారం నుంచి కనిపించకుండా పోయారు. సనా అమ్జద్, షోయబ్ చౌదరి అనే ఇద్దరు యూట్యూబర్లు భారత్‌లో కూడా చాలా ఫేమస్. తరుచుగా భారత్‌ని పాకిస్తాన్‌తో పోలుస్తూ అక్కడి ప్రజలకు అసలు నిజాలు చెబుతుంటారు. వీరిద్దరికి మిలియన్లలో సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. మన దేశం నుంచి కూడా లక్షలాది మంది వీరిని ఫాలో అవుతున్నారు.

Read Also: Saif Ali Khan: ‘‘మరో 2 మి.మీ. కత్తి లోతుగా దిగి ఉంటే..’’ సైఫ్ పరిస్థితిపై డాక్టర్లు..

అయితే, ఇప్పుడు భారత్‌లోని వాస్తవాలు చూపించడం పాకిస్తాన్ సైన్యానికి సమస్యగా మారింది. వీరిద్దరి వీడియోలు పాకిస్తాన్ వ్యాప్తంగా కూడా మిలియన్ వ్యూస్ దక్కించుకుంటున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న ప్రాపగండాపై నిజానిజాలు చెబుతున్నారు. భారత్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉంది, భారత అభివృద్ధి ఎలా ఉంది, పాకిస్తాన్ పరిస్థితి ఏంటి..?, కాశ్మీర్‌లో భారత ప్రభుత్వం ఎలాంటి స్కీమ్స్ అమలు చేస్తుంది, పీఓకేలో ప్రజల పరిస్థితుల వంటి వీడియోలు చేస్తూ అక్కడి ప్రజలకు నిజాలను చెబుతున్నారు. అంతర్జాతీయంగా భారత ప్రతిష్ట పెరగడం, పాకిస్తాన్‌ని ఎవరు పట్టించుకోకపోవడానికి కారణాలను అక్కడి ప్రజలను అడిగి తెలుసుకునే కంటెంట్‌ని చేస్తుంటారు. పాకిస్తాన్ వెనకబడి ఉండటానికి కారణాలు, పాక్ సైన్యం తీరుపై విమర్శలు గుప్పిస్తూ వీడియోలు చేశారు.

గత కొంత కాలంగా వీరిద్దరితో పాటు పలువురు యూట్యూబర్లు ఆ దేశంలో అణిచివేత, బెదిరింపులకు గురవుతున్నారు. సనా అమ్జాద్, షోయబ్ చౌదరితో పాటు దాదాపుగా 12 మంది యూట్యూబర్లు కొన్ని రోజులుగా కనిపించకుండా పోయారు. ప్రతీ రోజు వీరు చేసే కంటెంట్ వారి యూట్యూబ్ ఛానెళ్లలో వస్తుంటుంది. కానీ కొన్ని రోజులుగా వీరి కనిపించకుండా పోవడంతో పాటు, ఎలాంటి కంటెంట్ కూడా వారి ఛానెళ్లలో పోస్ట్ కాలేదు. వీరి ఛానెళ్లలోని కొన్ని వీడియోలు కూడా డిలీట్ అయ్యాయి. సైన్యం వీరిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం వీరిద్దరికి మరణ శిక్ష విధించిందనే ఊహాగానాలు అటు పాక్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాయి.