PM Modi: ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌పై ప్రశంసలు కురిపించారు. ఆయన ఇతర చట్టసభ సభ్యలకు స్పూర్తిగా కొనియాడారు. ఈ రోజు రాజ్యసభలో పదవీవిరమణ చేస్తున్న సభ్యులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సభలో వీల్‌చైర్‌లో వచ్చి మన్మోహన్ సింగ్ ఓటేసిన విషయానని పీఎం మోడీ గుర్తు చేశారు. చట్టసభ సభ్యులు తన విధుల పట్ల బాధ్యతతో ఉండటానికి ఇదో ఉదాహరణ అని అన్నారు.
మన్మోహన్ సింగ్ ఎవరికి మద్దతు ఇస్తున్నారనే విషయం గురించి కాదని.. అతను ప్రజాస్వామ్య బలోపేతం కోసం పనిచేసినట్లు తాను నమ్ముతున్నానని ప్రధాని మోడీ అన్నారు. ఆయన చిరకాలం జీవించాలని, మనకు మార్గదర్శకంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని మోడీ అన్నారు. నాయకుడిగా, ప్రతిపక్షంలో మన్మోహన్ సింగ్ అందించిన సేవలు అపారమైనవని, సైద్ధాంతిక విభేదాలు స్వల్పకాలికమని, కానీ ఆయన ఈ సభకు, దేశానికి చాలా కాలం పాటు మార్గనిర్దేశం చేసిన విధానం, ప్రజాస్వామ్యంలో ప్రతీ చర్చలోనూ ఆయన చేసిన కృషి గుర్తుండిపోతుందని ప్రధాని అన్నారు.
Read Also: Mood of the Nation 2024 survey: మళ్లీ ఎన్డీయేకే పట్టం.. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా..
ఆగస్టు నెలలో, ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాల్లో నిబంధనలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వానికి అధికారం కల్పించే కీలక బిల్లుపై చర్చ సందర్భంగా మన్మోహన్ సింగ్ వీల్‌చైర్‌లో పార్లమెంట్‌కి హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో కూడా ఆయన ఓటేసేందుకు వీల్‌చైర్‌లో వచ్చారు. ప్రధాని మోడీ ప్రసంగం తర్వాత మాట్లాడిన కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, మన్మోహన్ సింగ్ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంచిపనులకు మెచ్చుకోవాలి, చెడును విమర్శించండి అని ఖర్గే అన్నారు.
