Flydubai Pilot Smit Machchhar: Flydubai విమానంలో జరిగిన కాక్‌పిట్ ఘటనలో గాయపడిన భారత పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చార్ కు గొప్ప గౌరవం లభించింది. ఆయన ధైర్యాన్ని అభినందిస్తూ ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ Mankind Pharma స్మిత్ మచ్చార్, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన అక్టోబర్ 2న సంస్థ సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.
అసలు ఏం జరిగింది?
సెప్టెంబర్ 30న Flydubai Flight FZ1073 దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు వెళ్తుండగా కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. భారతీయుడైన కెప్టెన్ స్మిత్ మచ్చార్‌పై ఆయన సహ పైలట్ కత్తితో దాడి చేశారు. దాడిలో మచ్చార్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవగలిగారు. దీంతో ప్రయాణికులు, సిబ్బంది లోపలికి చేరుకుని దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంలో సహాయపడ్డారు. అనంతరం విమానం సౌదీ అరేబియాలోని తబుక్‌కు అత్యవసరంగా మళ్లించారు. విమానంలో 174 మంది ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఘటనపై UAE, ఇజ్రాయెల్ తదితర అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విమానయాన అధికారుల ప్రకారం, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన పలు వివరాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.
రూ.1 కోటి ప్రకటించిన Mankind Pharma
కెప్టెన్ స్మిత్ మచ్చార్ ధైర్యాన్ని ప్రశంసిస్తూ Mankind Pharma ఆయనకు, ఆయన కుటుంబానికి రూ.1 కోటి అందించనున్నట్లు తెలిపింది. కంపెనీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ జునేజా తన లేఖలో మచ్చార్ సంక్షోభ సమయంలో చూపిన ధైర్యం, ప్రశాంతత, బాధ్యతాభావాన్ని ప్రశంసించారు. ఈ మొత్తాన్ని ఆయనకు, కుటుంబానికి కృతజ్ఞతగా అందిస్తున్నామని సంస్థ పేర్కొంది. Mankind Pharma తన అధికారిక సోషల్ మీడియా పోస్టులో కూడా మచ్చార్ తనకంటే ముందుగా సిబ్బంది, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారని పేర్కొంది.

