NTV Telugu Site icon

Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు.. “సత్యమేవ జయతే” అంటూ సిసోడియా ట్వీట్

Manish Sisodia

Manish Sisodia

Manish Sisodia summoned by CBI in Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) నోటీసుల జారీ చేసింది. సోమవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ కేసులో సీబీఐ, ఈడీలు అనుమానితుల ఇళ్లపై పలు రాష్ట్రాల్లో దాడులు నిర్వహించాయి.  కొంతమందిని విచారిస్తున్నాయి. సోమవారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

సీబీఐ సమన్లపై మనీష్ సిసోడియా స్పందించారు. నా ఇంట్లో సీబీఐ 14 గంటలు దాడులు నిర్వహించింది. ఏం దొరకలేదు. నా బ్యాంకు లాకర్లలో సోదాలు చేశారు అప్పుడు కూడా ఏం దొరకలేదని.. హిందీలో మనీష్ సిసోడియా ట్వీట్ చేశారు. రేపు నన్ను ఉదయం 11గంటలకు సీబీఐ ప్రధాన కార్యాలయానికి పిలిచారు. నేను వెళ్లి నా పూర్తి సహకారం అందిస్తా అని.. సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు.

Read Also: T20 World Cup : తొలిపోరులోనే శ్రీలంకపై నమీబియా ఘన విజయం

2021-22 ఢిల్లీ మద్యం వివాదంలో భారీగా అవినీతి జరిగిందని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. దీనికి సంబంధించిన పలు ఆధారాలను సేకరించాయి. ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ1గా ఉన్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐల ద్వారా దాడులు చేస్తోందని ఆప్ నేతలు విమర్శిస్తున్నారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తుండటంతోనే తమను టార్గెట్ చేస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు.

ఈ కేసులో సీబీఐ గతంలో ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్ లోని 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఇదిలా ఉంటే మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేయడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. జైలు ఊచలు భగత్ సింగ్ ను అడ్డుకోలేదని.. మనీష్, సత్యేంద్ర జైన్ లు నేటి భగత్ సింగ్ లు అని.. స్వాతంత్య్రం కోసం ఇది రెండో పోరాటం అని..75 ఏళ్ల తరువాత పేదలకు మంచి విద్యను అందించి వారి భవిష్యత్తుపై ఆశలు కల్పించిన విద్యాశాఖ మంత్రి దేశానికి లభించారని.. కోట్లాది మంది పేదల ప్రార్థనలు మీ వెంట ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.