మణిపూర్‌లో గత కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అలాంటి వాతావరణమే కొనసాగుతోంది. మంగళవారం రాత్రి పశ్చిమ ఇంఫాల్‌లోని అదనపు ఎస్పీ అమిత్‌సింగ్ ఇంటిపై సుమారు 200 మంది సాయుధులు దాడి చేసి ఆయనతో పాటు మరొకరిని అపహరించుకుపోయారు. ఈ ఘటనతో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
ఈ పరిణామంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టాయి. మొత్తానికి గంటల వ్యవధిలోనే ఏఎస్పీని విడిపించుకుని తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనపై పోలీస్ కమాండోలు వినూత్న నిరసనకు దిగారు. బుధవారం ఆయుధాలు విడిచిపెట్టి విధులకు హాజరయ్యారు.
అసలేం జరిగిందంటే..
వాహనం ఎత్తుకెళ్లారన్న ఆరోపణలతో అరంబై టెంగోల్ గ్రూప్‌నకు చెందిన ఆరుగురు వ్యక్తులను ఏఎస్పీ అమిత్ అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన ఆ వర్గం వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ క్రమంలోనే ఏఎస్పీని అపహరించుకుని వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో పరిస్థితులు అదుపులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
