Site icon NTV Telugu

Karnataka: భర్తలారా..బహుపరాక్‌! ఇల్లాలు హత్య కేసులో జైలుకు భర్త.. తీరా చూస్తే..!

Karnatakamurdercase

Karnatakamurdercase

ఈ మధ్య ప్రియుడి మోజులో పడి భార్యలు… నిర్దాక్షిణ్యంగా కట్టుకున్నవాళ్లను కడతేరుస్తున్న ఘటనలు ఎక్కువగా వారల్లో చూస్తున్నాం.. వింటున్నాం. కానీ ఈ ఇల్లాలు మాత్రం భిన్నంగా ప్లాన్ చేసింది. చాలా పక్కా ప్రణాళికతో స్కెచ్‌ గీసింది. అనుకున్నట్టుగానే భర్త కటకటాల పాలయ్యాడు. ఆమె మాత్రం ప్రియుడితో కులాసాగా తిరుగుతోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. అసలేం జరిగింది. భర్త ఎలా జైలుకెళ్లాడు.. ఆమె.. ప్రియుడితో ఎలా జల్సా చేస్తుందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

సురేష్, మల్లిగే భార్యాభర్తలు. కర్ణాటకలోని కొడగు జిల్లా కుశాల్నగర్ తాలూకాలోని బసవనహళ్లి గ్రామంలో నివాసం ఉంటారు. 2019లో అకస్మాత్తుగా మల్లిగే అదృశ్యమైంది. దీంతో అతడు.. ఆమె జాడ కోసం కుటుంబ సభ్యులను, తెలిసిన వారందరి దగ్గర వాకబు చేశాడు. ఆమె ప్రియుడితో వెళ్లిపోయినట్లుగా గుర్తించాడు. అయితే ఒకసారి ఆమె ఫోన్ కలవడంతో.. దయచేసి పిల్లల కోసమైనా టచ్‌లో ఉండాలని సురేష్ బతిమాలాడు. అందుకు ఆమె ససేమిరా అంది.

అయితే తనను ఏ కేసులోనైనా ఇరికిస్తారన్న భయంతో సురేష్.. 2021లో కుశాల్ నగర్ పోలీసులకు భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. ఇదే అతడికి శాపమైంది. 2022లో పెరియపట్నం తాలూకాలోని బెట్టడపుర సమీపంలో మహిళ అస్థిపంజరం ఉందంటూ సురేష్‌ను, అతడి అత్తగారిని పోలీసులు పిలిపించారు. అక్కడున్న చీర, వస్తువులను బట్టి.. మృతదేహం తన భార్యదేనని చెప్పాడు. అనంతరం అస్థిపంజరాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. భార్యను చంపేశావంటూ సురేష్‌ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. తాను చంపలేందంటూ ఎంత మొత్తుకున్నా పోలీసులు పట్టించుకోలేదు.

సంవత్సరాల పాటు సురేష్ జైల్లో మగ్గిపోయాడు. అనంతరం అస్థిపంజరానికి సంబంధించిన ఫోరెన్సిక్ నివేదిక వచ్చింది. అందులో డీఎన్‌ఏ పరీక్షల్లో మల్లిగే కుటుంబానికి సంబంధించిన జన్యుపరంగా ఎలాంటి పోలిక సరిపోలేదు. దీంతో అస్థిపంజరం ఆమెది కాదని తేల్చారు. దీంతో సురేష్‌ను నిర్దోషిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు.

అయితే తాజాగా ఏప్రిల్ 1, 2025న మల్లిగే తన ప్రియుడితో సజీవంగా ప్రత్యక్షమైంది. మడికేరిలోని ఒక హోటల్‌లోకి ప్రియుడి చేతిలో చేయి వేసి నడుచుకుంటూ రావడాన్ని సురేష్ స్నేహితులు గమనించారు. ఇద్దరూ కలిసి కూర్చుని తినడాన్ని కనిపెట్టారు. అంతేకాకుండా ఫొటోలు తీశారు. ఫొటోలను సురేష్‌కు చూపించగా షాక్ అయ్యాడు. భార్య మల్లిగే అని కనిపెట్టాడు. అనంతరం ఆ ఫొటోలను పోలీస్ అధికారులకు చూపించగా వాళ్లు కూడా షాక్‌కు గురయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. మల్లిగేను అదుపులోకి తీసుకుని మైసూర్ కోర్టులో హాజరుపరిచారు.

Exit mobile version