Site icon NTV Telugu

Kerala Bomb Blasts: పేలుళ్లకు నాదే బాధ్యత.. పోలీసుల ముందు లొంగిపోయిన వ్యక్తి..

Kerala

Kerala

Kerala Bomb Blasts: కేరళలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్ లో ఈరోజు ఉదయం ఒక మతపరమైన కార్యక్రమంలో పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 45 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ప్రార్థనా సమయంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనపై ఎన్ఐఏతో పాటు కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also: Donald Trump: అధికారంలోకి వస్తే ముస్లింలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తా..

ఇదిలా ఉంటే ఈ కేసులో సంచలనం నమోదైంది. పేలుళ్లకు బాధ్యత వహిస్తూ 48 ఏళ్ల వ్యక్తి త్రిసూర్‌లో కేరళ పోలీసుల ముందు లొంగిపోయారు. అనుమానితుడిని డొమినిక్ మార్టిన్ గా గుర్తించారు. పార్థనా సమావేశాన్ని నిర్వహిస్తున్న అదే క్రైస్తవ వర్గానికి చెందిన వాడని పోలీసులు తెలిపారు. అదే ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ కేసులో అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని, హాల్ మధ్యలో పేలుడు జరిగిందని పోలీసులు చెప్పారు.

అయితే ఈ పేలుళ్ల వెనక అతని హస్తం ఉందా.. లేదా.. అనే విషయాలను పోలీసులు ఇంకా నిర్థారించలేదు. లొంగిపోయిన వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పేలుడు పదార్థాలను ఐఈడీగా గుర్తించారు.వీటిని టిఫిన్స్ బాక్సుల్లో పెట్టి పేల్చినట్లు కేరళ డీజీపీ షేక్ దర్వేష్ సాహెబ్ తెలిపారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ రేపు 10 గంటలకు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.

Exit mobile version