Man Accused Of Killing Intelligence Officer In Delhi Riots Arrested In Telangana: 2020 ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ అంకిత్ శర్మను అత్యంత కిరాతకంగా హతమార్చిన నేరస్తుల్లో ఒకడ్ని సోమవారం (10-10-22) తెలంగాణలో పట్టుకున్నారు. ఆ నేరస్తుడి పేరు ముంతజిమ్ అలియాస్ ముసా ఖురేషి. చాలాకాలం నుంచి ఇతడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికారులకు.. తెలంగాణలోని మీర్పేట్ గాయత్రి నగర్‌లో ఉంటున్నాడన్న సమాచారం అందింది. దీంతో.. అధికారులు రంగంలోకి దిగి, చాకచక్యంగా వ్యవహరించి, అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2020 ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీ అల్లర్ల సమయంలో ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మను చాంద్‌బాఘ్ పులియా, ఖజూరీ నాలా, మెయిన్ కారావ ప్రాంతంలో దారుణంగా హత్యమార్చారు. అనంతరం ఆయన మృతదేహాన్ని చాంద్‌బాఘ్ డ్రైనేజ్ వద్ద వదిలేశారు. ఈ ఘటన జరిగిన తర్వాతి రోజు అంకిత శర్మ మృతదేహాన్ని రికవర్ చేశారు. పోస్టు మార్టం రిపోర్ట్‌లో.. అత్యంత పదునైన కత్తులతో అంకిత్ శర్మను 52 సార్లు పొడిచినట్టు తేలింది. కేసు నమోదు చేసి, వెంటనే విచారణ చేపట్టగా.. పది మందిపై అనుమానం వచ్చి, వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. అరెస్టైన వారిలో ఆమ్ ఆద్మీ పార్టీ సిట్టింగ్ కౌన్సిలర్ తాహిర్ హుసేన్ కూడా ఉన్నారు. విచారణలో భాగంగా.. ఖురేషి కూడా ప్రధాన నిందితుడు అని తేలింది.
అయితే.. ఖురేషి అప్పటికే పరారయ్యాడు. ఎక్కడా గాలించిన ఆచూకీ దొరక్కపోవడంతో, అతనిపై రూ. 50,000 రికార్డ్ కూడా ప్రకటించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే.. ఆరు నెలల నుంచి ఖురేషి తెలంగాణలో ఉంటోన్న విషయం పోలీసులకు తెలిసింది. దీంతో.. అతడ్ని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని రాష్ట్రానికి పంపింది. అతడు మీర్పేట్‌లోని గాయత్రి నగర్‌లో తరచుగా ఒక మెడికల్ షాప్‌కి వెళ్తాడన్న విషయాన్ని పసిగట్టారు. సోమవారం కూడా కెమిస్ట్ షాప్‌కి వెళ్తున్న విషయం తెలిసి, దారిలోనే అడ్డుకొని అతడ్ని అరెస్ట్ చేశారు. ఖురుషీ ఇంతకుముందు కూడా కిడ్నాప్, అత్యాచార కేసుల్లో జైలుకి వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఆ సమయంలోనే అతనికి ముజీబ్ అనే నేరస్తుడితో పరిచయం ఏర్పడింది.
జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత.. ఖురేషీ తన మేనమామతో కలిసి ముర్గా మండిలో పని చేయడం మొదలుపెట్టాడు. కానీ, అతనికి వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోయేది కాదు. దీంతో, మళ్లీ నేరాలు చేయడం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 24వ తేదీన సమీర్, సల్మాన్ కలిసి చాంద్‌బాఘ్‌లో ఉన్న ఖురేషీ ఇంటికెళ్లారు. అప్పుడే వాళ్లు ఢిల్లీ అల్లర్లలో పాల్గొనాలని మాట్లాడుకున్నారు. ప్లాన్ ప్రకారం మరుసటి రోజు.. అంటే ఫిబ్రవరి 25న ఢిల్లీ అల్లర్లలో ముగ్గురు పాల్గొన్నారు. అప్పుడు ఐబీ ఆఫీసర్ అంకిత్ శర్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించి.. ఆ ముగ్గురు దాడి చేసి, కిరాతకంగా హతమార్చారు. ఈ కేసులో సల్మాన్, సమీర్‌లను ఇదివరకే అరెస్ట్ చేయగా.. ఇప్పుడు ఖురేషీని అదుపులోకి తీసుకున్నారు.
