NTV Telugu Site icon

Mamta Kulkarni: 25 ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన అలనాటి బాలీవుడ్ నటి మమత.. భావోద్వేగంతో కంటతడి

Mamtakulkarni

Mamtakulkarni

మమతా కులకర్ణి.. ఒకనాడు బాలీవుడ్‌ను షేక్ చేసిన హీరోయిన్. భారతీయ చలనచిత్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బెంగాలీ, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వక్త్ హమారా హై, క్రాంతివీర్, సబ్‌సే బడా కిలాడి, బాజీ తదితర హిందీ సినిమాల ద్వారా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక రేంజ్‌లో దూసుకుపోతున్న ఆమెకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఓ డ్రగ్ కేసు ఆమె జీవితాన్ని తలకిందులు చేసింది. అరెస్ట్.. జైలు.. ఇలా కెరీర్ నాశనమైంది. అనంతరం కెన్యాలో జీవితం స్థిరపడింది. దాదాపు దేశాన్ని వదిలిపెట్టి రెండు దశాబ్దాలకు పైగా అయిపోయింది. తిరిగి 25 ఏళ్ల తర్వాత మాతృభూమి మీద అడుగుపెట్టింది. ముంబై చేరుకున్నాక.. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. ఓ వైపు ఆనందిస్తూనే.. ఇంకోవైపు భావోద్వేగానికి గురైంది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.

మమతా కులకర్ణి 2016లో రూ.2,000 కోట్ల డ్రగ్ కేసులో ఇరుక్కున్నారు. ఏప్రిల్‌ 12న రెండు వాహనాల నుంచి మూడు కిలోల ఎఫిడ్రిన్‌ పౌడర్‌ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మమతా కులకర్ణితో సహా ఏడుగురిని మోస్ట్‌ వాంటెడ్‌గా పోలీసులు ప్రకటించారు. భర్త విక్కీ గోస్వామి మాదకద్రవ్యాలను విక్రయిస్తుంటారు. అయితే 2016 జనవరిలో కెన్యాలో జరిగిన సమావేశానికి మమతా కులకర్ణి హాజరైందని.. నిందితుడు అయిన భర్త విక్కీ గోస్వామి తదితరులతో సమావేశంలో పాల్గొన్నారని పోలీసులు ఆరోపించారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద 2016లో థానే పోలీసులు మమతా కులకర్ణిపై కేసు నమోదు చేశారు. అనంతరం ఆమె అరెస్ట్ కావడం.. జైలు జీవితం అనుభవించడం జరిగింది. కొద్దిరోజుల తర్వాత జైలు నుంచి విడుదలయ్యారు.

అయితే థానే పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని 2018లో మమతా కులకర్ణి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు గత ఆగస్టులో మమతకు క్లీన్‌ చీట్‌ ఇచ్చింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసును హైకోర్టు కొట్టివేసింది. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని న్యాయస్థానం తప్పుపట్టింది. ఈ కేసులో విచారణను కొనసాగించడం కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేయడమే తప్ప మరోటి కాదని జస్టిస్‌ భారతి డాంగ్రే, మంజుషా దేశ్‌పాండే ధర్మాసనం స్పష్టం చేసింది. జూలై 22 నాటి ఉత్తర్వుల్లో హీరోయిన్‌కు వ్యతిరేకంగా సేకరించిన సాక్ష్యాలు ప్రాథమికంగా ఆమెపై నేరం చేసినట్లుగా పరిగణించేందుకు సరిపోవని ధర్మాసనం స్పష్టం చేసింది. సంవత్సరాలుగా ఆరోపణలు ఉన్నప్పటికీ మమతా కులకర్ణి ఎప్పుడూ ఎటువంటి తప్పు చేయలేదని కోర్టు అభిప్రాయపడింది. ఈ కుంభకోణం ఆమె పబ్లిక్ ఇమేజ్‌ను ప్రభావితం చేసిందని.. ఆమె బాలీవుడ్ కెరీర్‌ను దెబ్బతీసిందని న్యాయస్థానం పేర్కొంది.

మొత్తానికి 25 ఏళ్ల తర్వాత కెన్యా నుంచి మమతా కులకర్ణి ముంబైకి వచ్చారు. మాతృభూమిని జ్ఞాపకం చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. అలనాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. మాట్లాడుతూనే.. దు:ఖానికి గురయ్యారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోను పోస్టు చేశారు. మమతా కులకర్ణి 2000 నుంచి కెన్యాలో నివాసం ఉంటున్నారు.

Show comments