Mamitha Baiju: ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

  • ప్రముఖ హీరోయిన్ మమిత బైజుకు అస్వస్థత
  • ఆస్పత్రిలో చికిత్స.. ఆస్ట్రేలియా టూర్ రద్దు
Mamitha Baiju

Mamitha Baiju

ప్రముఖ మలయాళ నటి మమిత బైజు ఆస్పత్రిలో చేరారు. తీవ్ర జ్వరం, ఒంటినొప్పితో బాధపడుతున్న ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆమె ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని మమిత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు.

మమిత బైజు ఈ వారం ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఓనం వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నారు. దీంతో సెప్టెంబర్ 5న జరగాల్సిన Lendaxis Clyde Onam 2026 కార్యక్రమాన్ని నిర్వాహకులు వాయిదా వేశారు. ఈ వేడుకకు మమిత ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.

ఆస్పత్రి నుంచి మమిత హెల్త్ అప్‌డేట్

ఆస్ట్రేలియాలో మమితను కలిసేందుకు ఎదురుచూస్తున్న అభిమానులను ఉద్దేశించి క్లైడ్ మలయాళీ అసోసియేషన్ ఓ వీడియోను విడుదల చేసింది. అందులో మమిత తన ఆరోగ్య పరిస్థితిపై స్పందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘‘దురదృష్టవశాత్తూ ముందుగా నిర్ణయించిన తేదీన నేను అక్కడికి రాలేకపోతున్నాను. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాను. ఎలాగైనా రావాలని అనుకున్నాను. కానీ వైద్యులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు” అని మమిత తెలిపారు. అనారోగ్యం కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోవడం తనకు బాధగా ఉందని ఆమె చెప్పారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆస్ట్రేలియా పర్యటనను రద్దు చేసుకోవడం తప్పనిసరి అయిందని వివరించారు.

వాయిదా పడిన ఓనం వేడుకలు

క్లైడ్ మలయాళీ అసోసియేషన్ గతంలోనే మమిత బైజును సెలబ్రిటీ గెస్ట్‌గా ప్రకటించింది. ఆమె పాల్గొనే ఓనం వేడుకల కోసం నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అయితే మమిత ప్రయాణం రద్దు కావడంతో.. ముందుగా నిర్ణయించిన తేదీన కార్యక్రమాన్ని నిర్వహించకుండా వాయిదా వేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం మమిత బృందం, కార్యక్రమం నిర్వహించాల్సిన వేదిక నిర్వాహకులతో కలిసి కొత్త తేదీని ఖరారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

త్వరలో కలుస్తా

తన కోసం ఎదురుచూస్తున్న నిర్వాహకులు, అభిమానులకు మమిత క్షమాపణలు తెలిపారు. త్వరలోనే క్లైడ్ మలయాళీ అసోసియేషన్ సభ్యులను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు మమిత బైజు చెప్పారు. “నేను వచ్చి క్లైడ్ కుటుంబ సభ్యులను కలవాలని ఎంతో కోరుకుంటున్నాను. అందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ప్రస్తుత పరిస్థితుల కారణంగానే నేను ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరో సందర్భంలో తప్పకుండా కలుసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాను” అని మమిత బైజు తెలిపారు.