Site icon NTV Telugu

Mamata Banerjee: బీజేపీపై దీదీ షాకింగ్‌ కామెంట్స్..

నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించి ఫుల్‌ జోష్‌తో ఉన్న కమలనాథులకు షాకిచ్చే కామెంట్‌ చేశారు పశ్చిమ బెంగాల్‌ సీఎం మమత బెనర్జీ. అప్పుడే ఆట ముగిసిపోలేదని.. మున్ముందు రాష్ట్రపతి ఎన్నికలు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. దేశంలోని మొత్తం ఎమ్మెల్యేలలో సగం మంది కూడా లేని బీజేపీకి ఈ ఎన్నిక అంత ఈజీ కాదన్నారు. ప్రతిపక్ష పార్టీలకే దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్నారని చెప్పుకొచ్చారు మమత. యూపీ ఎన్నికల్లో ఓడిపోయిన ఎస్పీ వంటి పార్టీలకు కూడా గతంలో కన్నా ఎక్కువ మంది శాసనసభ్యులున్నారని తెలిపారు. ఆట ఇంకా ముగిసిపోలేదని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మొదటి నుంచి బీజేపీ పేరు వింటేనే దీదీ కారాలు మిరియాలు నూరుతున్నారు. పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత తన స్వరాన్ని మరింత పెంచారు. దేశంలోని విపక్షపార్టీలను ఒక్కతాటిపైకి తీసుకొచ్చి, కమలం పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలని చూస్తున్నారు.

Read also: Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్‌ డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన..

రాష్ట్రపతి ఎన్నికలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకుంటారు. వీరిని ఎలక్టోరల్‌ కాలేజీ అంటారు. నామినేటెడ్‌ సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆ లెక్కన 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్‌సభ సభ్యులతో పాటు 4,120 మంది ఎమ్మెల్యేలు.. ఇలా మొత్తంగా 4,896 మంది రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేస్తారు. ఎంపీల ఓటు విలువ 708గా నిర్ణయించారు. ఎమ్మెల్యే ఓటు విలువ మాత్రం 1971 జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయించారు. రాష్ట్రాలను బట్టి ఈ విలువ మారుతూ ఉంటుంది. ఎంపీలు, ఎమ్మెల్యేల అందరి ఓట్ల విలువ కలిపి మొత్తం 10,98,903 అవుతుంది. ఇందులో 50 శాతం+1 ఓటు వచ్చిన వారు రాష్ట్రపతి అవుతారు. మరి దీదీ చెప్పినట్లుగా రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ కష్టాలు ఎదుర్కొంటుందా.. లేక సునాయసంగా గట్టెక్కుతుందో చూడాలి.

Exit mobile version