NTV Telugu Site icon

Mallikarjun Kharge: రాజ్యసభలో బీజేపీ ఎంపీపై ఖర్గే ఘాటు వ్యాఖ్యలు.. నోరు మూసుకుని కూర్చో అంటూ..

Kharge

Kharge

రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతివిమర్శలు కామన్ గా ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో హద్దులు దాటుతుంటాయి. ఒకరిపై ఒకరు ఘాటు వ్యాఖ్యలు చేసుకుంటుంటారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎగువ సభలో ప్రసంగించారు.

రాజ్యసభలో ప్రసంగిస్తున్న సమయంలో బిజెపి ఎంపి, మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ అడ్డుకోవడంతో ఆయన సహనం కోల్పోయారు. బీజేపీ ఎంపీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను మీ తండ్రి సహచరుడిని, మీరు నాకు చెప్పేదేంటి? నువ్వు ఏం మాట్లాడుతున్నావ్? నేను నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. నోరు మూసుకుని కూర్చో అంటూ మండి పడ్డారు. సహనం కోల్పోయిన ఖర్గే బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు.

ఖర్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర గందరగోళానికి దారితీశాయి. రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ కల్పించుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. మాజీ ప్రధాని చంద్రశేఖర్ దేశంలోని గొప్ప నాయకులలో ఒకరని.. ప్రజల్లో ఆయనకున్న గౌరవం అపారమైనదని అన్నారు. మాజీ ప్రధాని గురించి తన ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఖర్గేను కోరారు.