Site icon NTV Telugu

Mahua Moitra: “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో పార్లమెంట్ నుంచి ఎంపీ మహువా మోయిత్రా బహిష్కరణ

Mahua Moitra

Mahua Moitra

Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నాయకురాలు మహువా మొయిత్రాపై ‘క్యాష్ ఫర్ క్వెరీ’ ఆరోపణలకు సంబంధించిన ఎథిక్స్ కమిటీ నివేదికను అనుసరించి లోక్‌సభ నుంచి బహిష్కరణకు గురయ్యారు. 49 ఏళ్ల మహువా మోయిత్రా లోక్‌సభలో ప్రధాని నరేంద్రమోడీ, వ్యాపారవేత్త అదానీలను టార్గెట్ చేస్తూ ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్త దర్శన్ హీరా నందానీ నుంచి డబ్బులు తీసుకున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆమెపై ఎథిక్స్ కమిటీ విచారణ జరిపి, బహిష్కరించాలని సిఫారసు చేసింది. ఈ రోజు ఎథిక్స్ కమిటీ తన నివేదికను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టింది.

Read Also: Mahua Moitra: “సీబీఐని నా ఇంటికి పంపించి వేధించాలని అనుకుంటున్నారు”.. “క్యాష్ ఫర్ క్వేరీ” కేసులో హాట్ హాట్‌గా పార్లమెంట్..

రూ. 2 కోట్ల నగదు, విలాసవంతమైన వస్తువులను లంచంగా తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులతో పంచుకున్నారని తేలింది. అయితే ఆమె తాను లంచం తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు ఖండించారు. లాగిన్ వివరాలను వేరేవాళ్లకు ఇచ్చిన విషయాన్ని ఒప్పుకున్నారు.

లోక్‌సభ సభ్యురాలిగా తన బహిష్కరణపై మహువా మోయిత్రా పార్లమెంట్ వెలుపల మాట్లాడారు. నన్ను బహిష్కరించడం ద్వారా అదానీ సమస్యను దూరం చేయాలని ఈ మోడీ ప్రభుత్వం భావిస్తే.. దీనిని కోర్టులో చూపించండి అంటూ విమర్శించారు. యావత్ భారత్ దీనిని అదానీ వ్యవహారంలో మీరు చేస్తున్న చర్యల్ని గమనిస్తోందని అన్నారు. ఒక మహిళా ఎంపీని లొంగదీసుకోవడానికి, వేధించడానికి ఎంత దూరం వెళతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను దోషిగా తేల్చేందుకు ఎథిక్స్ కమిటీ అన్ని నిబంధనలను ఉల్లంఘించిందని మహువా ఆరోపించారు. రేపటి నుంచి సీబీఐని నా ఇంటికి పంపించి వేధించాలని అనుకుంటున్నారని చెప్పారు.

Exit mobile version