Site icon NTV Telugu

Maharashtra: “మహా”సంక్షోభంలో కీలక పరిణామం.. సంజయ్ రౌత్ కు ఈడీ సమన్లు

Sanjay Raut

Sanjay Raut

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో కీలక  పరిణామాలు ఎదురవుతున్నాయి. సినిమాను తలపించే విధంగా ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రెండు వర్గాలు విడిపోయిన శివసేన తమ పంతాలు నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే సీఎం ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఎంపీ సంజయ్ రౌత్ కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్( ఈడీ) సమన్లు జారీ చేసింది. జూన్ 28న విచారణకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి, ప్రస్తుతం సంక్షోభ పరిస్థితుల్లో కీలకంగా వ్యవహరిస్తున్న సంజయ్ రౌత్ ను ఈడీ విచారణకు రావాల్సిందిగా పిలిచింది. రేపు ముంబైలోని ఈడీ ఆఫీసులో విచారణ జరగనుంది. పత్రచల్ భూముల వ్యవహారంలో కుంభకోణానికి పాల్పడినట్లు సంజయ్ రౌత్ పై ఆరోపణలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే మరోవైపు గౌహతి, ముంబై కేంద్రంగా రాజకీయం మారుతోంది. ఏక్ నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వేయడంతో పాటు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా అజయ్ చౌదరిని నియమించడంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసింది. తమకు 38 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ఎంవీఏ ప్రభుత్వం మైనారిటీలో పడిందని కోర్టుకు ఇచ్చిన పిటిషన్ లో షిండే పేర్కొన్నారు.  ఎంవీఏ సర్కార్ కు మద్దతు ఉపసంహరించుకునే యోచనలో షిండే గ్రూప్ ఉంది. ఎమ్మెల్యేల సంతాకాలతో మహారాష్ట్ర గవర్నర్ కు షిండే వర్గం లేఖ రాసింది. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని భర్తరఫ్ చేయాలని గవర్నర్ ను కోరారు. ఇదిలా ఉంటే ఏక్ నాథ్ షిండేను శివసేన ఫ్లోర్ లీడర్ గా తొలగించి అజయ్ చౌదరిని నియమించింది శివసేన. తాజాగా ఈ నియామకానికి డిప్యూటీ స్పీకర్ ఆమోదం తెలిపాడు.

కాగా.. ఈడీ సమన్లపై సంజయ్ రౌత్ స్పందించారు. తనకు ఇప్పటికీ నోటిసులు అందలేదని.. నోటీసులు అందిన తర్వాత మాట్లాడుతానని.. అయినా రేపు నాకు వేరే పనులు ఉన్నాయని అన్నారు.

 

 

Exit mobile version